లక్ష్మణచాంద: పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు మొదటి భాగం పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రెండో భాగం(పార్ట్–2) పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని త్వరలోనే విద్యార్థులకు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 498, ప్రాథమికోన్నత పాఠశాలలు 89, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 118, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్ ఒకటి ఉన్నాయి. వీటిలో మొత్తం 47,330 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్యపుస్తకాలు ఆంగ్లం, తెలుగు రెండు మాధ్యమాల్లో ముద్రించడంతో వాటిని రెండు భాగాలుగా అందిస్తున్నారు. మొదటి భాగం ఇప్పటికే అందించగా, రెండో భాగాన్ని త్వరలో అందించనున్నారు.
జిల్లాకు చేరిన పుస్తకాలు..
జిల్లాలో విద్యార్థులకు అందించడానికి మొత్తం 1,13,950 పార్ట్–2 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి 1,06,000 చేరాయి. మిగిలిన 7,950 పుస్తకాలు దసరా సెలవుల్లో వస్తాయని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి వచ్చిన పార్ట్–2 పుస్తకాలను దసరా సెలవుల్లోనే ఆయా ఎంఆర్‌సీలకు సరఫరా చేసి, అక్కడి నుంచి పాఠశాలలకు పంపిస్తామని పేర్కొన్నారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
త్వరలోనే పంపిణీ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆద ర్శ పాఠశాల విద్యార్థులకు అవసరమైన పార్ట్ 2 పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికే 90 శాతం జిల్లాకు వ చ్చాయి. వీటిని ఎంఆర్సీలకు పంపి అక్కడ నుంచి పాఠశాలలకు అందిస్తాం. దసరా సెలవుల తర్వాత విద్యార్థులకు అందిస్తాం. – భోజన్న, డీఈవో


