అధ్వానంగా రోడ్లు.. వాగులపై వంతెనలు కరువు అత్యవసర వేళ అందని వైద్యం.. ప్రతీ వర్షాకాలం.. తెప్పలపైనే ప్రయాణం
పెంబి మండలం యాపల్‌గూడ వద్ద తెప్పపై చిన్నారితో బాలింత
ఖానాపూర్: నెల రోజుల్లోనే రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరు వాగు దాటుతూ వ రదలో కొట్టుకుపోయారు. మరొకరు అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కో ల్పోయారు. కారణాలు వేర్వేరైనా, సమస్య ఒకటే. వాగులపై వంతెనలు లేవు. గ్రామాలకు సరైన రహదారులు లేవు. దీంతో ఖానాపూర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలే కాదు, ప్రాణ రక్షణ కూడా సవాల్‌గా మారుతోంది. ఏళ్లుగా పరిష్కారం కాని ఈ వెతలను ఈ ఘటనలు మరోసారి గుర్తు చేశాయి.
వానాకాలం.. కష్టకాలం
పెంబి మండలం పస్పుల, తులసీపేట్, దయ్యాలమద్ది, అర్చన్‌తండా, యాపల్‌గూడ, గుమ్మెన, ఎంగ్లాపూర్ తదితర గ్రామాలతోపాటు ఖానాపూర్ మండలంలోని కుసుంపూర్, చామన్‌పల్లి గూడెం, పంగిడిగూడెం, కడెం మండలంలోని గంగాపూర్, రాణిగూడ, కొర్రతండా, దత్తోజిపేట్, మొర్రిపేట్, తౌడుతండా, దుబ్బతండా, దేవునిగూడెం, లక్ష్మీపూర్, అల్లంపల్లి, బాబానాయక్‌తండా, పాలరేగడి, గంగన్నపేట్, చంతగూడ, అద్దాల తిమ్మాపూర్, మీసాలభూమన్నగూడెం, మంగల్‌సింగ్ తండా, మిద్దెచింత, గండిగోపాల్‌పూర్, ఇస్లాంపూర్ వంటి పలు గ్రామాల ప్రజలు వాగుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కడెం, దొత్తి, బల్లి, గంగాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొట్టుకుపోయిన వంతెనలు..
పునర్నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం
పెంబి మండలం పస్పులకు వెళ్లే మార్గంలో కడెం వాగుపై ఉన్న వంతెన ఐదేళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయింది. ఇప్పటివరకు పునర్నిర్మాణం జరగలేదు. తాత్కాలిక రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కడెం మండలం గంగాపూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూడా గత ఐదేళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయింది. ప్రస్తుతం రీడిజైన్ చేసి రూ.22 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. గంగాపూర్‌లో పనులు కొనసాగుతున్నప్పటికీ పస్పుల వంతెన పునర్నిర్మాణం మాత్రం జరగకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వంతెన ఉండి ఉంటే పెద్దిరాజును సకాలంలో ఆసుపత్రికి తరలించే అవకాశం ఉండేదని వారు అంటున్నారు.
ఇకనైనా శాశ్వత పరిష్కారం అవసరం
వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడం సహజమే అయినా, వాటిపై శాశ్వత వంతెనలు నిర్మించి అన్ని కాలాల్లో రాకపోకలు సాగేలా రహదారులు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడెం వాగు, బల్లి వాగు, దొత్తి వాగు, గంగాపూర్‌లోని కడెం వాగు తదితరాలపై శాశ్వత వంతెనలు నిర్మించడంతో పాటు గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి వర్షాలతో వరద ప్రవాహం తగ్గకపోవడంతో నేటికీ పెంబి మండలం యాపల్‌గూడ, కడెం మండలం గంగాపూర్ వద్ద ప్రజలు తెప్పలపైనే ప్రయాణిస్తున్నారు.
గతంలోనూ ఎన్నో విషాదాలు
వాగులు, రహదారుల సమస్యల కారణంగా ఈ ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు విషాదాలు చోటు చేసుకున్నాయి. 2005 నుంచి 2012 మధ్య కాలంలో పెంబి మండలం పస్పుల, యాపల్‌గూడ గ్రామాల సమీపంలోని వాగులు దాటుతూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఎర్వచింతల్ వద్ద వాగు దాటుతుండగా ఓ గిరిజన యువకుడు మరణించాడు. అనేక గ్రామాలకు అంబులెన్స్‌లు వెళ్లలేని దుస్థితిలో ఎంతో మంది గర్భిణులు సకాలంలో ఆసుపత్రులకు చేరలేక రోడ్డుపైనే ప్రసవించిన సంఘటనలు ఉన్నాయి. 2014లో గుమ్మెన–ఎంగ్లాపూర్ ప్రాంతంలో వాగులు పొంగిపొర్లడంతో సర్పంచ్ ఎన్నికలను పది రోజులపాటు వాయిదా వేయాల్సి వచ్చింది.


