భైంసాటౌన్: జిల్లాలో వన్యప్రాణుల వేట కలవరపెడుతోంది. అడవి పందులే కాకుండా జింకలు, నెమళ్లు, ఉడుములు, బుర్క పిట్టలు, ఇతర అటవీ జంతువుల అక్రమ రవాణ రాకెట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అటవీ జంతువుల మాంసానికి ప్రత్యేక డిమాండ్ ఉండడంతో ఈ తంతు జోరుగా సాగుతోంది. స్థానికంగా వేటాడిన అటవీ జంతువులను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా తరలిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వాహనంలో 14 అడవిపందులను తరలిస్తుండగా భైంసా అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి శంకర్, బీట్ ఆఫీసర్ శివకుమార్ బాసర చెక్‌పోస్ట్ వద్ద వాహనాన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి సిద్దిపేట్ ప్రాంతానికి వీటిని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యాపారమే లక్ష్యంగా...
జిల్లాలో కడెం, పెంబి, ఖానాపూర్, తాండ్ర, మామ డ, దిమ్మదుర్తి, కుంటాల, కుభీర్, తానూరు, లోకేశ్వరం మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఎక్కువగా వన్యప్రాణుల సంచారం ఉంటుంది. జింకలు, ఉడుములు, నెమళ్లు, బుర్కపిట్టలు, అడవిపందులను వేటాడుతున్నారు. ము ఖ్యంగా అడవిపందుల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. అడవి పందుల మాంసానికి కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలోకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు చెల్లిస్తుండడంతో కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మనప్రాంతం నుంచి కిలోకు రూ.50 నుంచి రూ.100కు కొనుగోలు చేసి సిద్దిపేట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌తోపాటు బెంగళూరు, పూనే, ముంబయి వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. సిటీ ప్రాంతాల్లో అడవిపంది మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో, కేటుగాళ్లు వీటిని టార్గెట్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలించుకుపోతున్నారు.
అడ్డుకట్ట పడేనా...
జిల్లా నుంచి అటవీ జంతువులు అక్రమ రవాణ చేస్తూ తరచూ పట్టుబడుతున్న నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు మరింత నిఘా పెంచాల్సిన అవసరముంది. జిల్లా నుంచి అటవీ జంతువులను అక్రమంగా తరలిస్తున్న దుండగుల ఆటకట్టించాలి. ఈ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో విచారణ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ ప్రాంతాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేయాలి. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, వన్యప్రాణుల రక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలి. వేటగాళ్ల సమాచారం అందించే వారికి తగిన రక్షణ, రివార్డులు ప్రకటించాలి. పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడకుండా చేయాలి.
విచారణ
ముమ్మరం చేస్తాం..
ఇటీవల బాసర చెక్‌పోస్ట్ వద్ద అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని భైంసా రేంజ్ సిబ్బంది పట్టుకున్నారు. దుండగులు వాహనాన్ని వదిలేసి పారిపోయారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దందా వెనుక ఎవరున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారు.. అనే విషయాలపై లోతుగా విచారణ జరిపిస్తాం. వన్యప్రాణుల అక్రమ రవాణా చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.
– రమేశ్ రాథోడ్,
ఎఫ్‌ఆర్‌వో, భైంసా
ఈ ఏడాది ఆగస్టులో తానూరు మండలం మొగిలి బీట్ పరిధి నుంచి 23 అడవి పందులను అక్రమంగా రవాణా చేస్తుండగా భైంసా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. తాజాగా బాసర చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 14 అడవి పందులను పట్టుకున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు భైంసా రేంజ్ పరిధిలో 85 అడవిపందులను అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇక, అధికారుల కళ్లు గప్పి ఇంకా ఎన్ని అక్రమ రవాణకు గురయ్యాయో..? అడవిపందులే కాకుండా ఇతర వన్యప్రాణుల అక్రమరవాణా సైతం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.


