● ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీ
ఖానాపూర్: ‘ఆస్పత్రిలో పరిశుభ్రత ఇలాగేనా.. తాగునీటి ట్యాంకు వద్ద నాచు ఏంటి.. వెయిటింగ్ హాల్ ఇలాగే ఉంటుందా.. క్లీన్ చేయించడం మీ వల్ల కాకుంటే.. నాకు గ్లౌస్ ఇవ్వండి.. నేనే శుభ్రం చేస్తా’ అంటూ కలెక్టర్ భవేష్ మిశ్రా ఖానాపూర్ ఆస్పత్రి అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. మంగళవారం సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆస్పత్రిలోని వార్డులు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్, తాగునీటి ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్, వైద్య శాఖల మధ్య సమన్వ యం లేకపోవడమే అపరిశుభ్రతకు కారణమని డీసీహెచ్, సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని మందలించారు.
నిధులున్నా పనులు జరగడం లేదు..
ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వ ఖజానాలో రూ.36 లక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని విని యోగించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో సీసీ ప్లాట్‌ఫామ్, ఇతర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులపై దృష్టి పెడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోగుల ఫిర్యాదులపై ఆరా
కలెక్టర్ వార్డులను పరిశీలించారు. న్యూబార్న్ స్పెషల్ కేర్ యూనిట్ వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు నిర్ణయించిన ఆహార పట్టికను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
నర్సాపూర్(జి): కాళేశ్వరం 27 ప్యాకేజీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని రాంపూర్, దర్యాపూర్ గ్రామాల్లో కాలువ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటితో ప్రయోజనం పొందే మండలాలు, భూసేకరణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాపులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాలువ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణతో పాటు ఇతర పనులను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ అనిల్, ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ విఠల్, తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్ ఉన్నారు.


