● నిరుపయోగంగా ఫిష్‌ మార్కెట్‌ ● రహదారిపైనే చేపల విక్రయాలు.. ● మురుగునీరు, దుర్వాసనతో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

● నిరుపయోగంగా ఫిష్‌ మార్కెట్‌ ● రహదారిపైనే చేపల విక్రయాలు.. ● మురుగునీరు, దుర్వాసనతో అవస్థలు

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● నిరుపయోగంగా ఫిష్‌ మార్కెట్‌ ● రహదారిపైనే చేపల విక్రయాలు.. ● మురుగునీరు, దుర్వాసనతో అవస్థలు

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఈద్గాం సమీపంలో ప్రజాధనం రూ.కోటి వెచ్చించి నిర్మించిన ఆధునిక ఫిష్‌ మార్కెట్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. మత్స్యకారులు, చేపల విక్రేతలకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ భవనం లక్ష్యం నెరవేరకుండానే నిర్లక్ష్యానికి గురైంది. భవనం ఉన్నా చేపల విక్రయాలు రోడ్డుపైనే కొనసాగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రోడ్డుపైనే విక్రయాలు..

ఫిష్‌ మార్కెట్‌ భవనాన్ని నిర్మించి ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. మార్కెట్‌లో తగిన వసతులు లేకపోవడంతో చేపల విక్రేతలు ప్రధాన రహదారిపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం నడుపుతున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. చేపలను శుభ్రం చేసే క్రమంలో వెలువడే వ్యర్థాలు, మురుగునీరు రోడ్డుపైకి చేరుతున్నాయి. దీంతో దుర్వాసన వ్యాపిస్తోంది. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

మార్కెట్‌ భవనం నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. భవనం పరిసరాల్లో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హాస్టల్‌ విద్యార్థినులకు ఇబ్బందులు

ఫిష్‌ మార్కెట్‌ పక్కనే ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్‌ విద్యార్థినులకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మార్కెట్‌ పరిసరాల నుంచి వస్తున్న దుర్వాసనతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మురుగునీరు నిల్వ, ఆకతాయిల సంచారం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి వెచ్చించి నిర్మించిన భవనం లక్ష్యం నెరవేరాలంటే చేపల విక్రేతలను మార్కెట్‌లోకి తరలించడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

తాగుబోతులకు అడ్డాగా..

ప్రజాధనం వెచ్చించి నిర్మించిన చేపల మార్కెట్‌ తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ప్రజల సమస్యలను అధికారులు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేలా చూడాలి.

– జింక సూరి, బోయివాడ కౌన్సిలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement