ఊరేగింపుగా ఉండ్రాళ్లయ్యకు వీడ్కోలు వీధులు వీడి.. గంగమ్మ ఒడి చేరి.. అట్టహాసంగా గణనాథుడి పయనం భక్తుల భావోద్వేగాల మధ్య నిమజ్జనం జిల్లాకేంద్రంలో ఘనంగా శోభాయాత్ర
నిర్మల్: ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి లౌకరియా..’ ‘జైబోలో గణేశ్ మహరాజ్‌కీ..’ అంటూ చిన్నాపెద్దా నినదిస్తుండగా, బ్యాండ్ చప్పుళ్లు, డీజే మోతలు మోగిస్తుండగా, తన్మయత్వం.. భా వోద్వేగంతో కూడిన భక్తిని నింపుకున్న జనమంతా ఘనంగా సాగనంపగా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. 11 రోజులు పూజలందుకున్న పార్వతీపుత్రుడికి నిర్మల్‌వాసులు అట్టహాసంగా వీడ్కోలు పలి కారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన నిమజ్జనోత్సవం శనివారం సాయంత్రం వరకూ కొనసాగనుంది. దారి పొడవునా జనసందోహం, మరోవైపు భారీ బందోబస్తు నడుమ వినాయక శోభాయాత్ర సాగుతోంది.
‘గణ’ంగా సాగుతూ..
స్థానిక బుధవార్‌పేట్ ఒకటో నంబర్ గణపతి వద్ద గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిల, మున్సిపల్ వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. ఇక నంబర్ల వారీగా గణనాథులు ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాయంత్రం స్థానిక నగరేశ్వరవాడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వినాయకులకు స్వాగతం పలికారు. ఎవరి గణనాథుడి వద్ద వాళ్లు డీజేలు, బ్యాండ్‌లతో చిన్నాపెద్దా సందడి చేస్తూ ముందుకుసాగారు.
మూషికుడిపై వెళ్తున్నట్లే..
మెల్లగా కదిలే మూషికుడిపై వెళ్తున్నట్లే జిల్లాకేంద్రంలో నిమజ్జనోత్సవం సాఫీగా సాగుతోంది. ఒకదాని వెనుక ఒక వాహనం కదులుతుంటే.. దానిపైన కొలువుదీరిన వినాయక విగ్రహాలు భక్తులను వరుసగా దీవిస్తున్నట్లు కనువిందు చేశాయి. శోభాయమానంగా సాగిన ఈ నిమజ్జనోత్సవంలో పట్టణప్రజలతోపాటు చుట్టూ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి పాల్గొన్నారు. అందరూ గణపయ్యకు చివరిసారి పూజలు చేసి, డీజే పాటలకు చిందేస్తూ ముందుకు సాగారు. బ్యాండు చప్పుళ్లను మించిన డీజేల మోతతో పట్టణం మార్మోగింది. జిల్లాకేంద్రంలోని ఏ రోడ్డు చూసినా నిమజ్జనానికి కదులుతున్న గణనాథులే కనిపించాయి. శోభాయాత్ర రూట్‌లో ఇబ్బంది లేకుండా ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బంగల్ చెరువుకు మంగళమూర్తి..
వాడవాడలో కొలువైన గౌరీతనయుడిని భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. బుధవార్‌పేట్‌నుంచి జయశంకర్‌చౌరస్తా వరకు, అలాగే జయశంకర్ చౌరస్తా నుంచి బంగల్‌పేట్ వరకూ రోడ్లన్నీ గణనాథులు, జనంతో నిండిపోయాయి. బంగల్‌పేట్ బంగల్‌చెరువు(వినాయక సాగర్) వద్ద ప్రత్యేక క్రేన్‌తో నిమజ్జనం చేశారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు.


