లక్ష్మణచాంద: రీసర్వేతో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్‌లో భూముల రీసర్వే ప్రక్రియపై గ్రామస్తులు, రైతులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. నెల రోజులలో భూముల రీసర్వే పురోగతిని సమీక్షించారు. ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ విఠల్‌రావు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 1,241.29 ఎకరాల భూమి ఉండగా, ఇప్పటి వరకు 1,053.38 ఎకరాల్లో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. 187.31 ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉందని ఈనెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో భూముల హద్దులు, హక్కులకు సంబంధించి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యూ వెల్మల్ గ్రామంలో 80 శాతం రీసర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అక్టోబర్‌లో సర్వే పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఆమోదం రాగానే మిగిలిన ప్రక్రియ అయిన ఫాం నంబర్ 9 జారీ అనంతరం రెండు నెలల సమయం పడుతుందని అనంతరం ఫాం నంబర్ 12 జారీ చేసి చివరకు కొత్త ఆర్థిక సంవత్సరం వరకు రైతులకు పట్టా పాస్‌బుక్‌లు అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు రీసర్వేతో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే పూర్తయ్యే వరకు అధికారులకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేశ్, తహసీల్దార్ సంతోష్, ఎంపీవో జ్యోతి, సర్పంచ్ సాగర్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.
గ్రామ సభలో పాల్గొన్న రైతులు
న్యూ వెల్మల్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా


