ఖానాపూర్: పట్టణంలో వినాయక విగ్రహాల శోభాయాత్ర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి నాయకులు, అధికారులు ధ్వజారోహణ చేసి, మండపాల నంబర్ల వారీగా ఊరేగింపులను ప్రారంభించారు. బ్యాండ్ మేళాలు, డీజే చప్పుళ్ల నడుమ యువతీ, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్థానిక జగన్నాథ్‌రావు చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శివాజీనగర్ మండపం వద్ద మాస్కట్, బాడీ సూట్, కార్టూన్, గొరిల్లా, రాక్షస వేషధారణలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర సాగిన ప్రధాన రహదారికి ఇరువైపులా పలుచోట్ల భక్తులకు తాగునీరు, అల్పాహారం పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు.


