భైంసా: యూరియా కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులపై రవాణా భారం కూడా పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం యూరియా బస్తా రూ.266కే విక్రయించాల్సి ఉండగా.. రవాణా చార్జీల పేరిట సొసైటీల్లో రూ.50 వరకు, ప్రైవేట్ డీలర్ల వద్ద రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో డీసీఎంఎస్ కేంద్రాలకు యూరియా లోడ్‌తో వచ్చే లారీల రవాణా ఖర్చు ప్రభుత్వమే భరించే విధానముండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు చెల్లించడం నిలిపివేసిందని రైతులు, సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెండేళ్లుగా డీసీఎంఎస్ కేంద్రాల పరిధిలో యూరియా విక్రయాలపై రవాణా భారం ప్రభావం చూపుతోంది. తాజాగా, పీఏసీఎస్‌లపై లారీల అద్దె చెల్లింపులు భారం పడుతోంది.
ఒక్కో బస్తా రవాణా చార్జీ రూ.30కి పైగానే..
జిల్లాకు నిజామాబాద్ నుంచి యూరియా లారీలు వస్తున్నాయి. ఒక్కో లారీలో సుమారు 450 బస్తాలుంటాయి. లారీకి రూ.13,500 నుంచి రూ.15వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన బస్తా రవాణా ఖర్చు సుమారు రూ.30 నుంచి రూ.33 వరకు వస్తోంది. గోదాంలో దించేందుకు బస్తాకు రూ.5 హమాలీ చార్జీ చెల్లించాలి. రైతు తీసుకెళ్లే సమయంలో మళ్లీ హమాలీ చార్జీ పడుతోంది. అంటే, రవాణాతో పాటు రెండుసార్లు హమాలీ ఖర్చు కూడా రైతులు భరించాల్సి వస్తోంది.
పొట్ట దశలో తప్పనిసరి
ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు పొట్ట దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో యూరియా వేయడం కీలకం. యూరియా కోసం రైతులు సొసైటీలు, డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. యాప్‌లో యూరియా అందుబాటులో లేకపోవడం.. అందుబాటులో ఉన్న చోట అధిక రేటు వసూలు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఎరువుల కోసం అదనపు ఖర్చు రైతులకు భారంగా మారింది. యూరియా పూర్తిగా సబ్సిడీపై అందిస్తున్నప్పుడు దాని రవాణా, హమాలీ ఖర్చులనూ ప్రభుత్వమే భరించాలని రైతులు కోరుతున్నారు. నిర్ణయించిన రూ.266కే బస్తా అందేలా చర్యలు తీసుకోవాలని, యాప్‌లో నిరంతరాయంగా నిల్వ వివరాలు అందుబాటులో ఉంచాలని, అదనపు వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతుపైనే రెండింతలు..
యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266 కాగా.. రవాణా, హమాలీ ఖర్చులు కలిపి వాస్తవంగా రైతు చెల్లించే మొత్తం పెరుగుతోంది. ప్రస్తుతం సొసైటీల్లో బస్తాకు రూ.50 వరకు, ప్రైవేట్ డీలర్ల వద్ద రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. యూరియా యాప్‌లో లభ్యత లేకపోవడంతో అవసరమైన సమయంలో ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ధరపై ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


