నిర్మల్ టౌన్: నిర్మల్ కొయ్య బొమ్మల కళ సంరక్షణకు, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ కళ ద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బొమ్మల తయారీకి వాడే కలప కోసం పొనికి చెట్ల పెంపకాని కి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసరలో కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణ మంజూరు లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని, డిజిటల్ చెల్లింపుల్లో ప్రోత్సహించాలని సూచించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఎల్డీఎం రామ్‌గోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


