వైద్యం వసతులు..
ఎడ్లబండిలో చెత్తను సేకరిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్
భైంసా ఆస్పత్రిలో బీపీ చెక్ చేసుకోవడానికి వేచిఉన్న రోగులు
ఓపీ ఓ చోట.. బీపీ మరోచోట..!
భైంసాటౌన్: భైంసా ఏరియాస్పత్రిలో రోగులకు సరైన వైద్యసేవలందక ఇబ్బంది పడుతున్నారు. భైంసా పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల నుంచి, సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి సైతం రోగులు వస్తుంటారు. అయితే, ఓపీ గదుల్లో వైద్యులు రోగి నాడి పట్టి చూసిన పాపన పోవడం లేదు. తూతూమంత్రంగా రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మందులు రాసిస్తున్నారు. అయితే, వైద్యులు బీపీ చెక్ చేయకుండా ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో చేయిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో రోగులు బీపీ చెక్ చేసుకునేందుకు క్యూలో ఉంటున్నారు. వృద్ధులు, బీపీ పేషెంట్లు క్యూలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. రోగులకు మందులు ఇచ్చే గది సైతం ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. నర్సింగ్ సిబ్బంది సరిపడా లేక ఎమర్జెన్సీ విభాగంతోపాటు సాధారణ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. మందులు సరిపడా ఉన్నా.. సేవల్లో జాప్యం జరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసరంగా అందించాల్సిన కార్డియో, న్యూరో, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ వంటి విభాగాల సేవలు నామ మాత్రమయ్యాయి. ఈ విభాగాల్లో నిపుణు కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి రహదారులు ఉన్న జిల్లాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తలకు గాయాలై వస్తున్న క్షతగాత్రులకు ఇక్కడ సరైన వైద్యం లభించడం లేదు. న్యూరో సర్జన్ వైద్యులు అందుబాటులో లేరు. ఎంఆర్‌ఐ వంటి సదుపాయాలు లేవు. దీంతో క్షతగాత్రులను నిజాబాబాద్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. సకాలంలో చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక గుండెపోటుతో ఈ దవాఖానకు రోజుకు నాలుగైదు కేసులు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్యం అందుబాటులో లేక వారికి సేవలు అందడం లేదు. రూ.లక్షలు వెచ్చించి 2డీ ఎకో వంటి పరికరాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించి సేవలు అందించే వైద్య నిపుణుల లేరు. క్రిటికల్ కేర్ భవనం ఏర్పాటు చేసినా అందులో వైద్యులు, సిబ్బంది లేక సేవలు ప్రారంభం కాలేదు.
సిరంజీలు లేవు..
పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రి, జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో సిరంజీల కొరత రోగులకు ఇబ్బందిగా మారింది. 2 ఎంఎల్, 5 ఎం ఎల్, 10 ఎంఎల్ సిరంజీలు అందుబాటులో లేక రక్త నమూనాల సేకరణ, ఇంజక్షన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ దుకాణాల్లో సిరంజీలు కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ సేవలతోపాటు రక్త నమూనాల సేకరణ, వివిధ ఇంజక్షన్ల కోసం రోజూ సుమారు వెయ్యి నుంచి 1,500 వరకు సిరంజీలు అవసరమవుతాయి. రోగులే వీటిని బయట కొనుగోలు చేస్తున్నారు.


