కరెంటు కోతలపై కర్షకుల కన్నెర్ర! | - | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలపై కర్షకుల కన్నెర్ర!

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

● అప్రకటిత కోతలతో ఎండుతున్న పంటలు

కుభీర్‌, లక్ష్మణచాంద, సోన్‌ మండలాల్లో రైతుల ఆందోళన

భైంసా/లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఆగస్టు నాటికి 20 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. అయితే జూలై చివరన కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు నిండాయి. దీంతో భూగర్భ జలాలు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయి. ఈ క్రమంలో బోర్లు, బావుల కింద పంటలు వేసిన రైతులు ఖరీఫ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ, అప్రకటిత విద్యుత్‌ కోతలు వారి ఆశలకు గండికొడుతున్నాయి. అంతరాయాలతో కూడిన విద్యుత్‌ సరఫరాతో మోటార్లు నడవక పొలాలకు తడి అందడం లేదు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మామడలోనూ..

మామడ మండల పరిధిలో వ్యవసాయానికి రోజుకు 8 నుంచి 10 గంటల మేర మాత్రమే విద్యుత్‌ సరఫరా జరుగుతోందని రైతులు చెబుతున్నారు. అది కూడా ఒకేసారి కాకుండా మధ్యలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతోందని అంటున్నారు. సాయంత్రం వేళల్లోనూ కరెంటు పోతుండటంతో మోటార్లు నడపలేకపోతున్నామని వాపోతున్నారు. కనీసం 15 గంటలపాటు విద్యుత్‌ ఇస్తేనే పంటలను కాపాడుకోగలమని చెబుతున్నారు.

భైంసా, ముధోల్‌, బాసర మండలాల్లో..

బైంసా మండలంలోని పలు గ్రామాల్లోనూ వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. కరెంటు వచ్చిన కొద్దిసేపటికే పోవడంతో మోటార్లు సరిగా పనిచేయడం లేదని, పొలాలకు తడి పెట్టడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ముధోల్‌ మండలంలో రోజులో పలుమార్లు వి ద్యుత్‌ సరఫరా నిలిచిపోతోందని రైతులు చెబుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని పేర్కొంటున్నారు. బాసర మండలంలోని పలు గ్రామాల్లోనూ బోర్లు, బావుల ఆధారంగా సాగు చేస్తున్న రైతులు విద్యుత్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కరెంటు వచ్చిన సమయంలో మోటార్లు నడిపి నీరు పెట్టుకునేలోపే మళ్లీ సరఫరా నిలిచిపోతుందని రైతులు చెబుతున్నారు.

తానూర్‌లో అప్రకటిత కోతలు...

తానూర్‌ మండలంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకటించి న వేళల్లోనూ సరఫరా నిలిచిపోతుండటంతో పంట లకు నీరు పెట్టుకోవడం కష్టంగా మారిందని చెబు తున్నారు. వర్షాలు లేక భూమిలో తేమ తగ్గుతున్న సమయంలో కరెంటు కోతలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదంలో సోయా, వరి పంటలు..

సోయాకు తడి అవసరమైన సమయంలో నీరు అందక కొన్ని ప్రాంతాల్లో మొక్కలు వాడిపోతున్నాయి. బోర్ల కింద వరి నాట్లు వేసిన పొలాలు కూడా పొడిబారుతున్నాయి. కరెంటు కోసం రైతులు రాత్రిళ్లు పొలాల వద్ద ఎదురుచూస్తున్నారు. పగలు కరెంటు లేకపోతే రాత్రి వస్తుందేమోనని రైతులు పొలాల వద్దకు వెళ్లి ఎదురు చూడాల్సి వస్తోంది. కరెంటు వచ్చిన వెంటనే మోటారు ఆన్‌ చేసి పొలానికి నీరు పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. మధ్యలో సరఫరా నిలిచిపోవడంతో చేను తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరంతర విద్యుత్‌ ఇవ్వాలి

వర్షాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో బోర్లు, బావుల నీటితో పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కనీసం 15–16 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేస్తేనే పంటలను కాపాడుకోగలం. రోజులో చాలా సార్లు కరెంటు సరఫరా నిలిచిపోతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి. – ముత్తన్న, రైతు

పంటను కాపాడుకోవాలి

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. పంట చేతికొచ్చే సమయంలో నీటి తడి అందకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. నిరంతరాయంగా కరెంటు ఇస్తే పంటను కాపాడుకుంటాం.

– గంగాధర్‌, రైతు

విద్యుత్‌ కోతలతో పంటలకు నీరందకపోవడంతో కుభీర్‌ మండలంలో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కరెంటు సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. వర్షాలు లేక ఇప్పటికే పంటలు ఇబ్బందుల్లో ఉండగా.. బోర్ల ద్వారా నీరు పెట్టుకుందామంటే విద్యుత్‌ సరిగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లాపూర్‌, న్యూవెల్మల్‌, బొప్పారం సబ్‌స్టేషన్ల వద్ద నిరసన

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్‌ రైతులు సబ్‌ స్టేషన్‌ను రైతులు మంగళవారం ముట్టడించారు. విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, పంటలను కాపాడాలని కోరారు. సోన్‌ మండలం న్యూ వెల్మల్‌, బొప్పా రం గ్రామాలకు చెందిన రైతులు సబ్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యుత్‌ కోతలు ఇలాగే కొనసాగితే పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లక్ష్మణచాంద ఏఈ మహేశ్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా అక్కాపూర్‌ సబ్‌ స్టేషన్‌లో 50 వేల కేపీహెచ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందని, దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంని వెల్లడించారు.

కుభీర్‌లో రోడ్డెక్కిన రైతులు...

లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement