నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, యువత, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు రుణాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు, ప్రాధాన్యత రంగాలకు ఆర్థిక సహాయం, సా మాజిక భద్రతా పథకాల అమలుపై కలెక్టర్ సమీ క్షించారు. జిల్లాలోని బ్యాంకులకు రూ.7,952.87 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.2,331.18 కోట్లు (29.31 శాతం) సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రూ.6,661.73 కోట్ల లక్ష్యానికి రూ.1,847.71 కోట్లు (27.74 శాతం) సాధించారన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. విద్యా రుణాల మంజూరు తక్కువగా ఉందని, అర్హులైన విద్యార్థులకు అధిక సంఖ్యలో రుణాలు అందించాలన్నారు. విద్యార్థులే లక్ష్యంగా పెట్టుకున్న 3,500 ఖాతాల్లో ఇప్పటికే 1,022 కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ తదితర పథకాల అమలును కలెక్టర్ సమీక్షించారు. రుణ లక్ష్యాల సాధనకు జిల్లా పరిశ్రమల శాఖ బ్యాంకర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాల ని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ, పీఎం స్వనిధి రుణాల్లో ఎన్‌పీఏలను తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించా లని ఎల్‌డీఎంను సూచించారు. విజయ డెయిరీ సమన్వయంతో రైతులకు పాడి పశువుల కొనుగో లుకు రుణాలు అందించాలన్నారు. రైస్ మిల్లుల ఫైనాన్స్‌కు అవసరమైన ఎన్‌వోసీలు, బ్యాంకు గ్యారెంటీల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం బి.రామ్‌గోపాల్, ఆర్‌బీఐ ఏజీఎం, ఎల్‌బీవో ఎస్. రాములు, పీడీ డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్‌ఎం నవీన్, సీఎం క్రెడిట్ ఆర్‌బీవో ఆదిలాబాద్ పీయూష్, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


