పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

● శ్రావణమాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక సదుపాయం ● 30 మంది ప్రయాణికులు ఉంటే కోరిన క్షేత్రానికి సర్వీస్‌

నిర్మల్‌టౌన్‌: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ నిర్మల్‌ డిపో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక యాత్రా సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రతిపాదిత పుణ్యక్షేత్రాలు

మహారాష్ట్రలోని భద్రహనుమాన్‌, ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగం, సోమనాథ్‌, ద్వారక, ఎల్లోరా, త్రయంబకేశ్వర్‌తోపాటు రామేశ్వరం, మధురై, కంచి, శ్రీరంగం, అరుణాచలం, పళని, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ వంటి ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల ఆలయాలను దర్శించాలనుకునే భక్తులకు ఆర్టీసీ ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

30 మంది ఉంటే ప్రత్యేక బస్సు

కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే వారి అభీష్టం మేరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి కోరుకున్న పుణ్యక్షేత్రాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా భక్తుల బృందాలు కలిసి యాత్రకు వెళ్లాలనుకుంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. యాత్ర తేదీ, గమ్యస్థానాన్ని ముందుగా నిర్ణయించుకుని ఆర్టీసీ సిబ్బందిని సంప్రదిస్తే అందుకు అనుగుణంగా బస్సు ఏర్పాటు చేస్తారు.

సౌకర్యవంతమైన ప్రయాణం

సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు భక్తులు రైళ్లు లేదా ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక యాత్రా బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించనుంది. ఒకే బస్సులో పలు క్షేత్రాలను సందర్శించేలా యాత్రా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కార్తీకమాసంలో..

కార్తీకమాసంలోనూ ప్రముఖ శైవ, వైష్ణవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌, రామేశ్వరం, అరుణాచలం, త్రయంబకేశ్వర్‌, ద్వారక వంటి క్షేత్రాలకు భక్తుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.

సెప్టెంబర్‌ 2న పూరీకి ప్రత్యేక సర్వీసు

నిర్మల్‌ ఆర్టీసీ డిపో నుంచి సెప్టెంబర్‌ 2న పూరీ జగన్నాథ్‌ యాత్రకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు నడపనున్నారు. ఆరు రోజుల యాత్రలో అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం, కోణార్క్‌, పూరీ జగన్నాథ్‌, విశాఖపట్నం, ద్వారకా తిరుమల తదితర క్షేత్రాలను దర్శించుకుని సెప్టెంబర్‌ 7న నిర్మల్‌కు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి రూ.6,400 చార్జీ నిర్ణయించారు. భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలి. సీట్లను మొబైల్‌ ద్వారా లేదా నిర్మల్‌ బస్‌స్టాండ్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌లో బుక్‌ చేసుకోవచ్చు. వివరాలకు 9959226003, 7382842582 నంబర్లకు

సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement