నిర్మల్‌ఖిల్లా: గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మరింత మెరుగైన వలస విధానాన్ని రూపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈనెల 17న అధ్యయ యాత్రకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు మనీలాలోని ఇండియన్ ఎంబసీని శుక్రవారం సందర్శించారు. పలువురు అధికారులు, వలసకార్మిక ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ హర్ష కుమార్‌జైన్‌తో వలస కార్మికుల సంక్షేమం, రక్షణ, విదేశీ ఉపాధి అవకాశాలు, వలస విధానాల పై చర్చించినట్లు రాష్ట్రకమిటీ సభ్యుడు, ఉమ్మడిజిల్లాకు చెందిన స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే తెలంగాణ కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను స్వీకరించినట్లు వివరించారు. అనంతరం కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమయ్యారు. ఫిలిప్పీన్స్ అనుసరిస్తున్న వలస విధానాలు, విదేశాల్లో పనిచేస్తున్న తమ దేశ పౌరుల రక్షణ, వలసకు ముందు శిక్షణ, ఉపాధి కల్పన, సంక్షేమం, తిరిగి స్వదేశానికి వచ్చిన అనంతరం పునరావాసం అంశాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పర్యటనలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతిరెడ్డితోపాటు ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఎం.వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, నంగి దేవేందర్‌రెడ్డి, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ జునుగురు ఉన్నారు.


