‘స్మైల్’ సక్సెస్!
నిర్మల్‌టౌన్: గత నెల 1నుంచి జిల్లాలో ప్రారంభమై న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలనిస్తోంది. నెలరో జులుగా అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగినట్లు నోడల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. పాఠశాలలకు బదులు పనిలోకి వెళ్తున్న బాలబాలికలను గుర్తించి ఆపరేషన్ స్మైల్ బృందం వారు మళ్లీ బడికి వెళ్లేలా ప్రోత్సహించింది. బాలకార్మికులను జిల్లాలోని హోటళ్లు, పశువులు మందల వద్ద, వెల్డింగ్ షాపులు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో గుర్తించారు.
పిల్లల భవిష్యత్‌కు భద్రత
పిల్లల భవిష్యత్‌కు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ జిల్లాలో విజ యవంతమవుతోంది. వీధుల్లో భిక్షాటన చేస్తున్నవారిని, బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని రక్షించే దిశగా ఈ కార్యక్రమం మా నవీయ కోణంలో ముందుకెళ్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నిర్మాణ ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు 66మంది బాలకార్మికులను గుర్తించారు. ఇందులో 54మందిపై కేసు నమోదు చేయగా, మిగతా వారికి జరిమానా విధించారు. నిర్మల్ డివిజన్‌లో 34, భైంసా సబ్ డివిజన్‌లో 32మంది బాలబా లికలకు అవసరమైన కౌన్సిలింగ్, వైద్య పరీక్షల అ నంతరం కుటుంబాలకు చేర్చారు. ఇందులో 61 మంది బాలురు, అయిదుగురు బాలికలున్నారు.


