ముగ్గుల్లో ‘విజయ’లక్ష్మి
భైంసాటౌన్: ఆమె పేరు విజయలక్ష్మి.. పేరుకు తగ్గట్టే విజయం ఆమెను వరిస్తోంది.. ముగ్గుల పోటీ ఎక్కడ నిర్వహించినా.. ఆమె ముగ్గు వేసిందంటే ప్రథమ బహుమతి ఖాయం. అవును.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన విజయలక్ష్మికి భైంసాకు చెందిన శ్రీనివాస్‌తో వివాహం అయింది. భైంసా పట్టణానికి చెందిన విజయలక్ష్మి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె డిగ్రీ చదివే సమయంలో ఓ ముగ్గుల పోటీలో పాల్గొనగా, కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు. అప్ప టి నుంచి ముగ్గులంటే ఆసక్తి పెంచుకుని, సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. భైంసాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి 5 గ్రాముల వెండి నాణెం గెలుచుకోగా, ఈసారి కూడా మొదటి బహుమతిగా 3 గ్రాముల వెండినాణెం గెలుచున్నారు. నిర్మల్‌లో రెండేళ్ల క్రితం నిర్వహించిన ముగ్గుల పోటీలోనూ ప్రథమ బహుమతిగా రూ.6 వేలు గెలుచుకున్నారు. ముగ్గుల్లో పండుగ సంస్కృతి ప్రతిబింబించేలా వేయడమే తన విజయ రహస్యమని విజయలక్ష్మి తెలిపారు.


