అక్షరం ‘సాక్షి’గా ‘వర్సిటీ’
నిర్మల్: జిల్లావాసుల దశాబ్దాల ‘విశ్వవిద్యాలయ’కలను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ అంటూ ‘సాక్షి’ మీడియా చేసిన అక్షర కృషి ఫలించింది. చదువులమ్మ కొలువైన బాసరలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సభావేదిక మీదుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.
ఏలేటి అభ్యర్థన.. ఎనుముల ప్రకటన..
నిర్మల్ ప్రాంతవాసులు దశాబ్దాలుగా కోరుతున్న బాసర జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన సభలో ‘సాక్షి’ కథనాలను ఉటంకిస్తూ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, బాసరలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌కు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లోగా ప్రతిపాదనలు, నివేదికలన్నీ పూర్తిచేసి ఇవ్వాలని ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి సూచించారు. ప్రస్తుతానికి బాసరలోని ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలోనే ప్రారంభించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.
‘సాక్షి’ అక్షర కృషి..
జిల్లాలో గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎలాగైతే ‘సాక్షి’ అక్షర కృషిచేసిందో, అదే తరహాలో విశ్వవిద్యాలయ సాధనకు తోడ్పాటును అందించింది. జిల్లాకు కాకతీయ యూనివర్సిటీ చేస్తున్న నష్టాన్ని మొదలుకుని, జిల్లాలో విశ్వవిద్యాలయం అవశ్యకత వరకు వరుస కథనాలను ప్రచురించింది. అంతటితో ఆగకుండా జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్నివర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలతో ఆగస్టులో ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ అంటూ రౌండ్‌టేబుల్ సమావేశాన్నీ నిర్వహించింది. ‘సాక్షి’ తీసుకువచ్చిన కదలిక అన్నివర్గాల్లో చర్చనీయాంశంగామారి, అధికారులు, పాలకుల్లోనూ కదిలించింది. చివరకు సీఎం నోటితో వర్సిటీని ప్రకటించడంలో ఓ భాగమైంది.


