టెట్‌పై చట్ట సవరణ చేయాలి
ఖానాపూర్: విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెల జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టెట్‌పై చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో శుక్రవారం జరిగిన సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఫిబ్రవరి 5న ఆల్ ఇండియా జాక్టో అధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యంతో ఇలాంటి తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. తీర్పు వచ్చి నాలుగు నెలలు అయినా, దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు జారీ చేసి, సక్రమంగా అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం డీఏ ఏరియర్స్ 30 వాయిదాలలో చెల్లించే విధానం సరికాదన్నారు. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ రూపొందించి, అన్ని రకాల పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.1,500 కోట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్న యాదవ్, జె.లక్ష్మణ్, నాయకులు గోవింద్ నాయక్, వెంకటేశ్వరరావు, వాల్గోట్ శ్రీనివాస్, బాలాజీ, గంగాధర్, శ్యామ్, రాజన్న, పరమేశ్వర్, బక్కన్న పాల్గొన్నారు.


