సదర్మాట్‌తో 18 వేల ఎకరాలకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

సదర్మాట్‌తో 18 వేల ఎకరాలకు సాగునీరు

Jan 17 2026 9:15 AM | Updated on Jan 17 2026 9:15 AM

సదర్మాట్‌తో 18 వేల ఎకరాలకు సాగునీరు

సదర్మాట్‌తో 18 వేల ఎకరాలకు సాగునీరు

● ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి

నిర్మల్‌: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నిర్మల్‌ జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. తొలి పర్యటనలోనే వరాలతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్నారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. పీసీసీ అధ్యక్షుడిగా తొలి కార్యక్రమం 2021లో నిర్మల్‌లో చేపట్టినం. దళిత, గిరిజన దండోరా పేరిట మొదటి భారీసభ ఇంద్రవెల్లిలో నిర్వహించగా రెండూ భారీస్థాయిలో విజయవంతం చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన భరోసానే సీఎంగా నిలిపింది. పోరాటం, పౌరుషానికి ప్రతీకై న ఈగడ్డ పై పుట్టిన రాంజీగోండు, కుమురంభీం స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు స్వరాష్ట్రంలో పదేళ్లు అన్యా యం జరిగింది. నా సొంతజిల్లా పాలమూరుతో సమానంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు భరోసా ఇచ్చారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు పలువరాలు ప్రకటించారు. ఉమ్మడిజిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించారు. సదర్మాట్‌ బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో పాల్గొన్నారు.

బాసరలోనే యూనివర్సిటీ..

బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం మిగితా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ప్రజలకు తమ ప్రాంతానికి యూనివర్సిటీ రాలేదన్న బాధ కలిగించి ఉండవచ్చు కానీ, వాయిదాలు పెట్టుకుంటూ పోతే అభివృద్ధి కాదని స్పష్టం చేశారు. నిర్మల్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోరిక మేరకు జిల్లాకేంద్రంలో స్టేడియం ఏర్పాటు, మున్సిపల్‌ అభివృద్ధి, మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు, కొత్త కలెక్టరేట్‌ మార్పులపైనా దృష్టిపెడతామని హామీ ఇచ్చారు.

తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం..

తుమ్మిడిహెట్టి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కట్టితీరుతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశా రు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహితపై ప్రాజెక్టును కట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రాజెక్టును కట్టి రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా సర్వేలు, నివేదికలు రెడీ అవుతున్నాయని చెప్పారు.

మామడ: మండలంలోని పొన్కల్‌ గ్రామ సమీపంలో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజీని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.676 కోట్లతో నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజీతో 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. నిర్మల్‌ కడెం, ఖానాపూర్‌ మండలాల్లో 13 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌లో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని పేర్కొన్నారు. బ్యారేజీతో కడెం, ఖానాపూర్‌, కోరుట్ల మండలాల్లో 34 గ్రామాల వ్యవసాయ భూములకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

రైతు సంక్షేమ లక్ష్యం..

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రైతుభరోసా, రైతు రుణమాఫీ, పంట కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్‌ ఖానాపూర్‌ ముధోల్‌ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెడమ బొజ్జు పటేల్‌, రామారావు పటేల్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, అంజిరెడ్డి, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీ షర్మిల, స్థానిక సర్పంచ్‌ చిట్యాల లక్ష్మి, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, వేణుగోపాలచారి, స్థానిక నాయకులు హరీశ్‌కుమార్‌, గంగారెడ్డి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement