ఇక సదర్మాట్ పరవళ్లు
● కలెక్టర్, ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ‘జూపల్లి’
మామడ: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న జిల్లాలో పర్యటించనున్నారు. మండలంలోని పొనకల్ గోదావరినదిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని గోదావరి తీర గ్రామాలకు సాగునీరు అందనుంది. రూ.520.16 కోట్లతో చేపట్టిన ఈ బ్యారేజీ పనులు 2016లో ప్రారంభమైనా, అధికారికంగా మాత్రం 2017లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇందుకు నిర్మల్ జిల్లాలో 805 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 371 ఎకరాలు సేకరించారు. 1.58 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ బ్యారేజీ ద్వారా 13,120 ఎకరాల సదర్‌మాట్ ఆయకట్టుకు, 4,896 ఎకరాల జగిత్యాల జిల్లాలోని గంగనాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. ప్రాజెక్ట్‌లోని బ్యాక్ వాటర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించే అవకాశముంది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి బ్యారేజీ 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని దిగువన ఏడు కిలోమీటర్ల దూరంలో సదర్‌మాట్ ప్రాజెక్ట్ ఉంది.
34 గ్రామాలకు సాగునీరు
జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని 14 గ్రామాలకు, కడెం మండలంలోని 10 గ్రామాలకు, జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు గ్రామాలకు, మల్లాపూర్ మండలంలోని ఆరు గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందనుంది. బ్యారేజీ కింద 10కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉండనుంది. బ్యారేజీ ఎత్తు 19 మీటర్లు కాగా, ఆనకట్ట పొడవు 987 మీటర్లుగా ఉంది. పొన్కల్ వైపు మట్టి కట్ట పొడవు 740 మీటర్లు కాగా, జగిత్యాల జిల్లాలోని వేములకుర్తి వైపు మీటర్లుగా ఉంది. బ్యారేజీని 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీని పైనుంచి వాహనాలు వెళ్లే అవకాశం ఉండడంతో పొన్కల్ నుంచి వివిధ గ్రామాలు, జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. బ్యారేజీ నిర్మాణంతో చేపలు పట్టేవారికి మెరుగైన ఉపాధి లభించనుంది. కడెం, ఖానాపూర్ రైతుల సాగునీటి సమస్య తీరుతుంది. కాగా, ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసిన పొన్కల్ రైతుల మిగతా భూముల సాగు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని, బ్యారేజీకి పొన్కల్ ‘నాగదేవత బ్యారే జీ’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. బ్యారేజీ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని సదర్‌మాట్ వరకు కెనాల్ నిర్మించి సాగునీటిని అందించాలని అక్కడి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రారంభానికి సిద్ధమైన సదర్మాట్ బ్యారేజీ
ఇక సదర్మాట్ పరవళ్లు


