నేడు సం‘క్రాంతి’
నిర్మల్: రంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలతో వీధులన్నీ స్వాగతం పలుకంగా, నోములతో పూజలు చేయంగా, చిన్నాపెద్ద పతంగులతో సందడి చేస్తుండగా.. సంక్రాంతి పండుగొచ్చింది. వస్తూవస్తూ కొత్త కాంతినీ తీసుకువచ్చింది. ప్రకృతితో ముడిపడిన మన పండుగల్లో మకర సంక్రాంతికీ ప్రత్యేకత ఉంది. హేమంత రుతువులో మార్గశిర మాసపు శీతలగాలులు, మంచు కురిసే ఈ వేళలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రభాకరుడు ఇప్పటి నుంచి తన వెలుగు, వేడినీ పెంచుతూ పోతాడు. జిల్లావ్యాప్తంగా బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. సంక్రాంతి పర్వదినాన్ని గురువారం జిల్లా ఘనంగా జరుపుకోబోతోంది.
మకర సంక్రమణం
సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడు కనుక. ఈ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో పంటలు చేతికొస్తాయి. అందుకే ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జిల్లాలోనూ పండుగ సందడి రెండురోజుల ముందునుంచే మొదలైంది. చాలా గ్రామాల్లో యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక పతంగుల సందడి వారం నుంచే కొనసాగుతోంది. ఏ డాబాపై చూసినా చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ కనిపిస్తున్నారు.
ఆంధ్ర సంబురాలకు మనోళ్లు
తెలంగాణలో దసరా పండుగకు ఉన్నంత సందడి సంక్రాంతికి ఉండదన్న ఫీలింగ్ ఎప్పటినుంచో ఉంది. ఇక పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబురాలు జోరుగా సాగుతాయి. అక్కడివాళ్లకు ఇదే పెద్ద పండుగ. నెల ముందునుంచే పండుగ సందడి మొదలవుతుంది. పల్లెటూర్లు మొత్తం పండుగ కళతో కనిపిస్తాయి. సంక్రాంతి అంటేనే అక్కడ కోడిపందేలు ఆడటం. వీటిని తిలకిస్తూ అక్కడి వంటకాలను ఆస్వాదించేందుకు జిల్లా నుంచి ఏటా చాలామంది జిల్లా యువకులు ఆంధ్రకు వెళ్తున్నారు. ఈసారి కూడా చాలామంది వెళ్లారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి ఎంజాయ్ చేయడంతో పాటు చుట్టూ ఉండే ప్రముఖ క్షేత్రాలు, ప్రాంతాలనూ చూసివచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.


