అభ్యసన మెరుగుపడేలా ఎఫ్‌ఎల్‌ఎస్
ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాచరణ అమలు భాష, గణితాంశాల సాధనకు ప్రాధాన్యం ఫిబ్రవరి 26న 3వ తరగతి విద్యార్థులకు పరీక్ష
నిర్మల్‌ఖిల్లా: పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎ స్) జిల్లావ్యాప్తంగా అమలవుతోంది. 3వ తరగ తి విద్యార్థుల భాష(తెలుగు/ఆంగ్లం), గణిత సా మర్థ్యాలను పరీక్షించడం దీని ముఖ్య లక్ష్యం. వి ద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రాథమిక స్థాయిలో నే మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సన్నద్ధత
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. భాషా నైపుణ్యాలకు సంబంధించి సరళ పదాల గుర్తింపు, వాక్యాలు ధారాళంగా చదవడం, అర్థాలు చెప్పడం సాధన చేయిస్తున్నారు. గణిత నైపుణ్యాలకు సంబంధించి అంకెల గుర్తింపు, కూడిక, తీసివేతలు వంటి ప్రాథమిక కార్యకలాపాలు నేర్పుతున్నారు. రాత పరీక్షలతోపాటు ఆలోచనా ప్రక్రియను తెలుసుకునే ప్రశ్నలు ఎఫ్‌ఎల్‌ఎస్‌లో ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో భయం తొలగడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు మెరుగవుతాయి.
భవిష్యత్ ప్రణాళిక..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం మూడో తరగతి వరకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం నైపుణ్యాలు సాధించడం. ఎఫ్‌ఎల్‌ఎస్ ఫలితాల ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖ ఈ ఫలితాలను దిక్సూచిగా తీసుకుని మార్పులు తీసుకురానుంది.
ఎన్సీఈఆర్టీ ఆదేశాలు..
ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు ఎన్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఎఫ్‌ఎల్‌ఎస్‌ను ప్రారంభించారు. గతంలో జాతీయ సాధన సర్వే(ఎన్‌ఏఎస్)నిర్వహించగా, ఇప్పుడు ఈ కొత్త విధానం అమలులో ఉంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, గణిత విషయాల్లో పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 26న రాష్ట్రవ్యాప్త పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 535 ప్రాథమిక, 87 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులు పాల్గొంటారు.
నమూనా పరీక్షలు..
విద్యార్థుల సంసిద్ధత కోసం మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ చివరలో మొదటి దశ ని ర్వహించారు. జనవరి మూడో వారంలో రెండో దశ, ఫిబ్రవరి రెండో వారంలో మూడో దశ నిర్వహిస్తారు. ఈమేరకు రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇ చ్చారు. స్కూల్ కాంప్లెక్స్‌లలో ఉపాధ్యాయుల కు మార్గదర్శనం అందించారు. 190 పేజీల బి ట్‌బ్యాంక్ సాఫ్ట్‌కాపీలు పంపారు. ఈ సన్నాహాలతో లోపాలను గుర్తించి, తదుపరి సంవత్సరం అభ్యసన ప్రక్రియలు రూపొందిస్తారు.
అభ్యసన సామర్థ్యాలు మెరుగుకు..
ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్షల కోసం మూడో తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తూ సన్నద్ధం చేయాలని ఇది వరకే ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులను ఆయా పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి. – భోజన్న, డీఈవో


