రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
నిర్మల్‌టౌన్: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మద్దతులో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గెలుపొందడం శుభ పరిణామమన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు దొంగ హామీలుగా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. సర్పంచులు ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మహేశ్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జీవన్‌రావు, నహీం, నజీర్, అక్రమ్, చిన్నారెడ్డి, అశోక్, సాయిరెడ్డి పాల్గొన్నారు.


