నిర్మల్ ఉత్సవాలు విజయవంతం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రజలు సైతం పెద్ద ఎత్తున నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రచారం కల్పించాలన్నారు. నిర్మల్ జిల్లా చరిత్ర తెలియజెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించే ఉత్సవాలకు ప్రొటోకాల్ పాటిస్తూ, ప్రజాప్రతినిధులను, ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. సంతకాల బోర్డు, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండ చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ప్రజల నుంచి స్వీకరించిన సూచనలను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో రాజేందర్, అగ్నిమాపక అధికారి శివాజీ, ఉద్యానవన అధికారి రమణ పాల్గొన్నారు.


