కొత్తదనం కనిపించాలె..
ఈయేడు పాలకవర్గాలన్నీ కొత్తవే..
ఇక అన్నిరంగాలపై దృష్టిపెట్టాలె
అభివృద్ధిలో జిల్లా పరుగులెత్తాలె..
2026లో కొత్త పుంతలు తొక్కాలె..
మార్పు కోరుతున్న జిల్లావాసులు
నిర్మల్: 2026.. కొత్తసంవత్సరం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త లక్ష్యాలు. కాలగమనంలో ఇలా ఎన్నో ఆంగ్ల సంవత్సరాలు మారినా.. ప్రతీసారి నయాసాల్ అంటే తెలియని ఉత్సాహం.. ఈ ఏడాదిలో కొత్తగా ఏదో సాధించేయాలన్న ఆరాటం.. ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అలాగే మన జిల్లాలోనూ మార్పులు తీసుకురావాలన్న ఆశలు కూడా అందరికీ ఉన్నట్లే పాలకులు, అధికారులకూ ఉంటాయి. జిల్లాను అన్నిరంగాల్లో సమప్రాధాన్యతతో అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. కొత్త ఏడాదిలో జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమూ ఉంది. గతేడాదిలో కొన్నిరంగాల్లో దూసుకెళ్తే.. మరికొన్నింట్లో అంతంత మాత్రంగానే అభివృద్ధి కనిపించింది. గత లోపాలను అధిగమించి పురోభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఏడాదిలో ఇటీవలే గెలిచిన సర్పంచులతో పాటు స్థానిక సంస్థలకూ కొత్తపాలకవర్గాలు రానున్నాయి. ఈనేపథ్యంలో 2026లో జిల్లా కొత్తదనంతో ఉత్సాహంగా ముందుకు సాగాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
అభివృద్ధికి అనుకూలం
జిల్లాలో అభివృద్ధికి కావాల్సిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్–నాగ్‌పూర్ ప్రధా న మార్గమైన ఎన్‌హెచ్–44, మరోవైపు మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి పలు ప్రధాన నగరాల నుంచి జిల్లా మీదుగా జగిత్యాలవైపు వెళ్తున్న ఎన్‌హెచ్–61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణా విషయంలో ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బంది లేని, అలాగే అభివృద్ధికి ఉపయుక్తంగా ఉండే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సి న అవసరముందన్న వాదన కూడా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జిల్లా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధిస్తోంది. ఎప్పటి నుంచో ఆశిస్తున్న యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీలను జిల్లాకు తీసుకురావాల్సిన అవసరముంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలనూ జిల్లాకు తీసుకువస్తే ఉపాధి, ఉత్పత్తి పెరిగి రైతులకు మరింత లాభసాటిగా మారుతుంది.
వేగం పెరగాలి
బాసర నుంచి కడెం దాకా మొత్తం 19మండలాలతో నిర్మల్ జిల్లాగా ఏర్పడి పదేళ్లు కావస్తోంది. ఇప్పటి దాకా జిల్లా సాధించింది కొంతే. గతేడాదిలో పలు శాఖలు జాతీయస్థాయిలో జిల్లా అవార్డులు అందుకున్నా.. ఇంకా చాలారంగాల్లో పురోగతి అవసరం. కొత్త ఏడాదిలో అభివృద్ధిలో మరింత వేగం పుంజుకోవాలని జిల్లావాసులు ఆశిస్తున్నారు. మా రుమూల తండాలు, గూడేలకూ అభివృద్ధి ఫలాలు చేరాలి. ఇప్పటికీ జిల్లాలోని కడెం, పెంబి, ఖానాపూర్, సారంగపూర్, మామడ తదితర మండలాల్లోని గుట్ట, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలు, తండాలు, గూడేలకు సరైన రోడ్డుమార్గాలు లేవు. చాలావరకు ఆదివాసీ గూడేల్లో కరెంట్ కూడా లేదన్న విషయాన్ని గుర్తించి, వారికి విద్యుత్ వెలుగులు అందించాల్సిన అవసరముంది. ఈ కొత్త సంవత్సరంలో సదర్‌మాట్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపట్టిన ప్యాకేజీల పనులను ఈ ఏడాదిలోనైనా వేగంగా పూర్తి చేసి, రైతాంగానికి మరింత దన్నుగా నిలవాలి.
మనదైన ముద్ర ఉండాలి
రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు మార్మోగాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో రాజకీ య కేంద్రంగా ఉన్న నిర్మల్ ఇక ముందు రాష్ట్రస్థాయిలో తన పేరును చాటుకోవాలని జిల్లావాసులు తపిస్తున్నారు. ప్రధానంగా క్రీడారంగంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగ గల క్రీడాకారులున్నా వారికి ప్రోత్సాహం కరువైంది. సరైన వసతులు లేక ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి రాలేక ఆగిపోతున్నారు. నత్తనడకలో సాగుతున్న మినీస్టేడియాలను కొత్త ఏడాదిలో ప్రారంభించి క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో వందశాతం అందేలా చూడాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. ఇలా అన్ని రంగాల్లో.. అన్ని అంశాల్లో జిల్లా మేటిగా నిలవాలని ఆశిస్తున్నారు. ఇందుకు 2026 నుంచే ఆరంభం కావాలని ఆకాంక్షిస్తూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు.
పర్యాటకంపై దృష్టి పెట్టాలి
ఓరుగల్లును తలపించే నిర్మల్ గఢ్‌లు, రాంజీగోండు, గౌతమ బుద్ధుని శిష్యుల అడుగులు, మైమరిపించే కడెం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలు, బాసర మొదలుకుని ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు.. ఇలా పర్యాటక, చారిత్రక సొబగులను తనలో ఇముడ్చుకున్న జిల్లా మనది. దశాబ్దాల నాటి కట్టడాలు, అప్పటి నిర్మాణాలకు కొదవలేదిక్కడ. కేవలం ఉన్నవాటిని మెరుగులద్దుకుని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. గతంలో ప్రయత్నాలు చేసినా.. అవి మధ్యలోనే నిలిచిపోయాయి. కళ్లముందున్న ప్రకృతి అందాలు, కట్టడాలను అభివృద్ధి చేయాలని జిల్లావాసులు ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇక ఈ కొత్త ఏడాదిలోనైనా జిల్లాలో పర్యాటక శోభ విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నారు.
కొత్తదనం కనిపించాలె..


