
విద్య, వసతులకు ప్రాధాన్యం
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(ఎఫ్ ఏసీ)గా భోజన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్‌కు చెందిన ఆయన సొంతజిల్లాకు డీఈవోగా రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా ‘సాక్షి’తో మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
సాక్షి : సొంత జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది?
డీఈవో : చాలా ఆనందంగా ఉంది. పుట్టి పెరిగి, చదువుకున్న జిల్లాలోనే డీఈవోగా పనిచేయడం బాధ్యతను మరింత పెంచింది. సమష్టి కృషితో జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తాను.
సాక్షి : పదో తరగతి ఫలితాల మెరుగునకు ఏం చర్యలు తీసుకుంటారు?
డీఈవో : పదో తరగతి ఫలితాల్లో గతంలో రెండుసార్లు జిల్లా రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. గతేడాది 15వ స్థానానికి పడిపోయింది. ఈసారి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల సహకారంతో జిల్లాను మరోసారి ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. దాని ప్రకారం ముందుకెళ్తాం.
సాక్షి : ఎఫ్‌ఆర్‌ఎస్ 100 శాతం అమలు కావడం లేదు?
డీఈవో : పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్)తప్పనిసరి. నిర్ణీత సమయానికి ఉపాధ్యాయులు హాజరై ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయాలి. జిల్లాలో 55 శాతమే అమలవుతోంది. త్వరలోనే వంద శాతం అమలయ్యేలా చర్యలు తీసుకుంటా.
సాక్షి : విద్యాశాఖలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తారు?
డీఈవో : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు, వ్యాయామ విద్య, కోకరికులం యాక్టివిటీలు సజావుగా జరిగేలా చూస్తాను. కలెక్టర్ ప్రవేశపెట్టిన ’బాలశక్తి’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.
సాక్షి : ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఆరోపణలు వచ్చాయి. మీరెలా అధిగమిస్తారు?
డీఈవో : పూర్తి నివేదిక తీసుకుని పొరపాటుకు కారణమైన బాధ్యులపై చర్య తీసుకుంటాం. ఈనెల 4లోపు ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి.
సాక్షి : గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
డీఈవో : జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. గుర్తింపు లేని పాఠశాలలను త్వరలోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు జారీ చేస్తాం.

విద్య, వసతులకు ప్రాధాన్యం