
915 ఎకరాల్లో పంటనష్టం
472 మంది రైతుల పంటలు నీట మునక పత్తి, వరి రైతులకు అధిక నష్టం ప్రాథమికంగా గుర్తించిన వ్యవసాయశాఖ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఇటీవల వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా 915 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడు మండలాల్లో 472 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించగా, క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు సేకరించారు. నిర్మల్, ఖానాపూర్, కడెం నియోజకవర్గాల్లోని సారంగాపూర్, పెంబి, కడెం మండలాల్లో నష్టం ఎక్కువగా నమోదైంది.
పత్తి పంటకు అధిక నష్టం
పంటల్లో పత్తికి అత్యధిక నష్టం వాటిల్లినట్లు తేలింది. మొత్తం 810 ఎకరాల్లో పత్తి పంట నీటమునిగి దెబ్బతింది. ప్రస్తుతం కాయ దశలో ఉన్న ఈ పంటలో అడుగు భాగంలోని కాయలు మునిగి కుళ్లిపోయాయి. మొక్కల ఆకులు ఎరుపు రంగులోకి మారడంతో దిగుబడి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో 700 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు నిర్ధారణ అయింది. 107 ఎకరాల్లో వరి పంట కూడా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి నివేదిక..
పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. పూర్తిస్థాయి సర్వే ద్వారా వివరణాత్మక నష్ట అంచనా చేయనున్నారు. నిబంధనల ప్రకారం, 33 శాతానికి మించి నష్టం జరిగిన పంటలను మాత్రమే నష్టపోయినవిగా గుర్తిస్తారు.
నష్టం అంచనాలు సిద్ధం చేయండి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు, రహదారులు, భవనాలకు అధిక నష్టం వాటిల్లిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాఖల వారీగా అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన నష్టం, సర్వే తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు. నష్టంపై ప్రతీశాఖ క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 29 లోపు సర్వే పూర్తి చేసి సంబంధిత శాఖల హెచ్‌వోడీలకు నివేదికలు పంపాలన్నారు. సమావేశంలో డీఈవో పి.రామారావు, డీఏవో అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మండలం వరి పంట పత్తి పంట
కడెం 75 40
పెంబి 0 700
సారంగాపూర్ 30 70
మొత్తం పంట నష్టం 915
వరి పంట నష్టం 105 ఎకరాలు
పత్తి పంట నష్టం 810 ఎకరాలు
మొత్తం రైతులు 472 మంది