
భద్రతా లోపాలు ఉండొద్దు
నిర్మల్ టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కడా భద్రతాలోపం కనిపించొద్దని ఎస్పీ జానకీషర్మిల్ ఆదేశించారు. వేడుకల ప్రారంభం నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష మంగళవారం నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైం అవగాహన, రోడ్డు ప్రమాద నివారణలపై కీలక సూచనలు చేశారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రోడ్లపై వాహనాల రద్దీ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను అమలు చేయాలని ఆదేశించారు.
సైబర్ క్రైంపై అవగాహన..
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ ద్వారా మోసాలకు గురవుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా https://www.cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు..
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ముందస్తుగా గమనించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అత్యాచారం, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. దొంగతనం, ఆస్తి సంబంధిత నేరాలపై నేరస్తుల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. అంబీస్ టెక్నాలజీ, చాన్స్ ప్రింట్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కేసులను ఛేదించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.