కడెం: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కడెం ప్రాజెక్టును ఎస్పీ జానకీషర్మిలతో కలిసి గురువారం సందర్శించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన మేరకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలాలన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు, ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీరు, దిగువకు వదులుతున్న నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గేట్లను ఎత్తాల్సిన పరిస్థితి వస్తే దిగువన ఉన్న అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో భారీ వర్షాలపై చాటింపు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు సమీపంలోకి ప్రజలను, చేపలు పట్టే వారిని, రైతులను, పశుకాపరులను, సందర్శకులను, అనుమతించవద్దని తెలిపారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలలో అలుగులు పారే ప్రదేశాలలో పోలీసు సిబ్బంది గస్తీ కాయాలని అన్నారు. అనంతరం ప్రాజెక్టు పవర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన స్కాడా సిస్టం స్క్రీన్‌లో ప్రాజెక్టుపై అమర్చిన కెమెరాల ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గమనించారు. వారివెంట ఏఎస్పీ రాజేశ్‌మీనా, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ ప్రభాకర్, డీఎఫ్‌వో నాగిని భాను, ఎస్‌ఈ వెంకటరాజేంద్రప్రసాద్, ఈఈ విఠల్, డీఈఈలు నవీన్, వీరన్న, కె.గణేశ్ తదితరులు ఉన్నారు.