
మత్తు ఇంజక్షన్ ఇచ్చి పశువుల చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లాలో కొంతకాలంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్ దాదాపు 40 మందితో టీమ్ తయారు చేసి గ్యారేజ్ ఏర్పాటు చేశాడు. అతనితో పాటు మహారాష్ట్రకు చెందిన షేక్ జమీర్, షేక్ ముర్తుజా, మహమ్మద్ నసీర్, సయ్యద్ అక్రమ్, షోయబ్, ఫైజాన్, రాజు, భైంసాకు చెందిన షేక్ ఉమెర్, ఖలీద్, తాయూబ్ ముఠాగా ఏర్పడ్డారు. వీరికి సోహెల్ నాయకత్వం వహించాడు. వారంతా జిల్లాలో పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చోరీ చేసి మాంసాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో విక్రయించేవారు. వారికి ఖలీద్ మత్తు ఇంజక్షన్లు సప్లై చేసేవాడు. ఇటీవల ఈ ముఠా పశువులను చోరీ చేసేందుకు వాహనంలో ముధోల్‌కు రాగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఏడుగురు రెండు కార్లలో రాజస్థాన్ పరారయ్యారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద ఉన్నట్టు గుర్తించి అక్కడి పోలీసుల సహాయంతో వారిని నిర్మల్ తీసుకొచ్చారు. వారితో పాటు షేక్ ఉమెర్, ఖలీద్‌ను భైంసాలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, 8 ఫోన్లు, రూ.39,280 నగదును స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కు చెందిన రాజు, భైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంతో చాకచక్యంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, భైంసా రూరల్ సీఐ నైలు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.