బ్రెయిన్‌ స్ట్రోక్‌..నెల రోజుల ముందుగానే ఇలా గుర్తించవచ్చు | Sakshi
Sakshi News home page

Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎందుకు వస్తుంది? ఆ సంకేతాలు వస్తే స్ట్రోక్‌ వచ్చినట్లేనా?

Published Mon, Aug 14 2023 10:59 AM

What Is the Main Cause of Brain Stroke, How Do You Prevent It - Sakshi

ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా చనిపోతున్నారన్న వార్తలు తరచు వింటున్నాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య రాకముందే దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం.
 

మెదడు కణాలకు ఆక్సిజన్‌ అవసరం. ఈ ఆక్సిజన్‌ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు సమస్యను ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. 

బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎన్ని రకాలు?
బ్రెయిన్‌ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. 

ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు.
హీమోర్‌హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి.
ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు
ఏ రకమైన స్ట్రోక్‌ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు.

అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి.
► ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. 

మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు మార్పులు..

  • ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు.
  •  ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి.
  • ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట.
  •  ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుంది.
  •  అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి.
  •  ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గల కారణాలు

అధిక రక్తపోటు,డయాబెటిస్‌,అధిక కొలెస్ట్రాల్‌,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. కానీ జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి స్ట్రోక్‌ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. 

చికిత్స ఇలా..
పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను స​ంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్‌ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. 

స్ట్రోక్‌ నుంచి నెల ముందే కాపాడొచ్చు

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం వంటివి సాధారణ లక్షణాలే అయినా, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరగుతుంది. 

కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి జరుగుతుందని యూకేలో 1300మందిపై ఇటీవలె జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన మరో లక్షణం తలనొప్పి. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

- డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు
   ఫోన్ -9703706660

Advertisement
 
Advertisement
 
Advertisement