Polavaram Project: ఫలించిన వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటం

YSRCP MPs Meets Union Minister Gajendra Singh Shekhawat July 28th - Sakshi

కేంద్ర జలశక్తి మంత్రితో వైఎస్సార్‌ సీపీ ఎంపీల భేటీ విజయవంతం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీల సమావేశం విజయవంతమైంది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ అంగీకరించారు. ఈ క్రమంలో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వచ్చేవారం కేంద్ర కేబినెట్‌ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది.

కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
వైఎస్సార్‌సీపీ ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా... నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

‘‘ఐదు అంశాలపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడం.. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరాం. కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామన్నారు. ఇక బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని అడిగాం. అది సాధ్యం కాదు.. వారం పదిరోజుల్లో రీయింబర్స్‌ చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ.1920 కోట్లు రీయింబర్స్‌ చేస్తామన్నారు. రూ.47,725 కోట్లు కేబినెట్‌ ద్వారా ఆమోదించేందుకు సిద్ధమని తెలిపారు. రానున్న కేబినెట్‌ సమావేశంలో అంచనాలను ఆమోదించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించాలని కోరాం. ఇందుకు కేంద్రమంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top