వీడియో చూసి దోచేశారు | YouTuber Gives Home Tour, Shows Gold, Gets Robbed Of Items Worth Rs 10 Lakh | Sakshi
Sakshi News home page

వీడియో చూసి దోచేశారు

Jun 9 2026 5:22 AM | Updated on Jun 9 2026 5:22 AM

YouTuber Gives Home Tour, Shows Gold, Gets Robbed Of Items Worth Rs 10 Lakh

మధ్యప్రదేశ్‌లో కంగుతిన్న మహిళా యూట్యూబర్‌

భోపాల్‌: సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విషయాలను, సంపదతోపాటు ఇతర అంశాలను అతిగా ప్రదర్శించుకోవడం వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో హెచ్చరించే తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన యూట్యూబర్‌ రచనా గుర్జర్‌ తన ఛానెల్‌లో హోమ్‌ టూర్‌ పేరుతో తమ ఇంట్లో నగదు, బంగారు నగలను చూపుతూ ఓ వీడియో అప్‌లోడ్‌ చేశారు. అది జరిగిన కొద్ది రోజులకే ఆమె ఇంట్లో రూ.10 లక్షల విలువైన సొత్తును దొంగలు దోచుకున్నారు.

 మోహని గ్రామానికి చెందిన గృహిణికి యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రచన ఇటీవల తన సోషల్‌ మీడియా అకౌంట్లలో తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తూ వీడియోలు పోస్ట్‌ చేశారు. ఒక వీడియోలో ఇంటి గేట్‌ నుంచి ఇంట్లో ఉన్న రూముల వరకు చూపించారు.  టేబుల్‌పై నగలు, భారీగా నగదు పెట్టి మరో వీడియో చేశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. 

ముందుగా కర్ర సాయంతో ఇంట్లోని సీసీటీవీ కెమెరాల దిశ మార్చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియ పెట్టారు. ఇల్లంతా వెతికి దాదాపు రూ.10 లక్షల బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు స్థానికులు లేదా చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చని శివపురి అడిషనల్‌ ఎస్పీ సంజీవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన వీడియో చూసి దొంగలు ప్లాన్‌ చేసి దోచేశారని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement