
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు.
నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు.
ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు.