Yoga Break App: కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్‌.. 5 నిముషాల సమయం

Yoga classes for central government employees - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 నిమిషాల యోగా బ్రేక్‌

ప్రాణాయామం, యోగా చేయడం కోసం వై–బ్రేక్‌ యాప్‌ రూపకల్పన

న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్‌ బ్రేక్‌ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్‌ రాబోతోంది. అదే యోగా బ్రేక్‌..   పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం  ఈ యోగా బ్రేక్‌ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది.

ఇందుకోసం  కేంద్ర ఆయుష్‌ శాఖ  వై–బ్రేక్‌ యాప్‌ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్‌ సమయంలో వై–బ్రేక్‌ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్‌ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

ఆ యాప్‌లో ఏముంది ?
పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్‌ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్‌ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్‌ యాప్‌ని ప్రారంభించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top