ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం

Women to take centre stage at farmers protest sites at Delhi other borders - Sakshi

న్యూఢిల్లీ/భోపాల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్‌ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు.

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ సింగ్‌ తికాయత్‌ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్‌లో, మార్చి 14న రేవాలో, మార్చ్‌ 15న జబల్‌పూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు.  ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్‌పై మధ్య ప్రదేశ్‌లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ వారంట్‌ పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో జైతారిలో  పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్‌ కూడా  పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్‌ అరెస్టయ్యారు. బెయిల్‌పై విడుదలైన తికాయత్‌ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్‌ జారీ అయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top