రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Mega Women Farmers Fair begins | Sakshi
Sakshi News home page

రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Mar 9 2026 5:09 AM | Updated on Mar 9 2026 5:09 AM

Mega Women Farmers Fair begins

రూ.500 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం  

మహిళా రైతులకు డ్రోన్లు  

మంత్రి తుమ్మల వెల్లడి 

మెగా మహిళా రైతు మేళా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌/ఏజీవర్సిటీ: రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. తెలంగాణ రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేళాను నిర్వహించారు. వ్యవసాయ వర్సిటీ, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళా రైతులకు డ్రోన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంట మార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.   

ఆహార ధాన్యాల్లో స్వావలంబన: మంత్రి శ్రీధర్‌బాబు 
అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను ఉపయోగించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు రైతులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట కోసి ఇంటికి చేరేవరకు మహిళలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. 

ఐకార్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎంఎల్‌ జాట్‌ మాట్లాడుతూ కొత్త సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పంటల వైవిధ్యీకరణ, మార్కెట్‌లతో రైతాంగాన్ని అనుసంధానం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 30 మంది మహిళా రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. మెగా మహిళా రైతు మేళాలో సుమారు 6 వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్, వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement