Karnataka: కౌన్‌ బనేగా కర్ణాటక సీఎం?

Who Will be Next Karnataka CM - Sakshi

సీఎంగా యడియూరప్ప రాజీనామాతో పెరిగిన ఉత్కంఠ

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త సీఎం ఎంపిక

తమకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం కర్ణాటక పౌరుల మెదళ్లను తొలచేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ వర్గాల నుంచి బలమైన నేతను నేనేనంటూ చాలా మంది ముందుకొచ్చినా.. బీజేపీ ఢిల్లీ నాయకత్వం కొందరి పేర్లనే పరిశీలనలోకి తీసుకుందని సమాచారం.

నిఘా వర్గాలు, ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్‌ సీనియర్‌ సలహాదారులు,ఆర్‌ఎస్‌ఎస్, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల నుంచి తెప్పించిన నివేదికలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి మోదీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. లింగాయత్, ఒక్కలిగ ఇలా ఒక వర్గం వ్యక్తికే సీఎం పదవి ఇస్తున్నామనేలా కాకుండా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎంపికచేయాలని పార్టీ భావిస్తోంది. సీఎం పదవి వరించే అవకాశముందని పేర్లు వినిపిస్తున్న వారిలో ముఖ్యల గురించి క్లుప్తంగా..

బసవరాజ్‌ బొమ్మై(61)
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రి అయిన బసవరాజ్‌ సోమప్ప బొమ్మై.. యడియూరప్పకు అత్యంత దగ్గరి వ్యక్తి. లింగాయత్‌. మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడైన బసవరాజ్‌ కూడా ‘జనతా పరివార్‌’కు చెందినవారే. 2008లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగానూ చేశారు.

మురుగేశ్‌ నిరానీ(56)
ప్రస్తుతం గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. లింగాయత్‌లలో ప్రముఖమైన పంచమ్‌శాలీ లింగాయత్‌ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వృత్తిపరంగా పారిశ్రామికవేత్త అయిన ఈయనకు చెందిన విద్యుత్, చక్కెర తదితర పరిశ్రమల్లో లక్షకుపైగా కార్మికులు ఉన్నారు. హోం మంత్రి అమిత్‌ షాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు.

అరవింద్‌ బెల్లాద్‌(51)
ఉన్నత విద్యను అభ్యసించిన అరవింద్‌ బెల్లాద్‌కు నేతగా మంచి పేరుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్‌ చట్టసభ్యుడైన చంద్రకాంత్‌ బెల్లాద్‌ కుమారుడే ఈ అరవింద్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న అరవింద్‌కు యువనేతగా కర్ణాటకలో ఏ అవినీతి మచ్చాలేని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు.

బసన్నగౌడ పాటిల్‌(57)
విజయపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బసన్నగౌడ గతంలో కేంద్రంలో టెక్స్‌టైల్స్, రైల్వే శాఖల సహాయమంత్రిగా  చేశారు. లింగాయత్‌ వర్గానికి చెందిన ఈయన గతంలో రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎంఎల్‌సీగానూ పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో పంచమశాలీ లింగాయత్‌లనూ బీసీలుగా గుర్తించాలని, రిజర్వేషన్‌ కల్పించాలని జరిగిన ఉద్యమానికి సారథ్యం వహించారు.

సీటీ రవి(54)
బీజేపీ ప్రస్తు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీటీ రవి ఒక్కలిగ వర్గానికి చెందిన నేత. సంఘ్‌ పరివార్‌కు చెందిన వ్యక్తి. బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ బీఎల్‌.సంతోష్‌కు బాగా సన్నిహితుడు. కర్ణాటకలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా రాజీనామా చేసి కేంద్రంలో పార్టీ పనుల్లో క్రియాశీలకంగా మారారు.

సీఎన్‌ అశ్వథ్‌ నారాయణ్‌(52)
కర్ణాటక డెప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. వైద్యవిద్యను అభ్యసించిన సీఎన్‌ అశ్వథ్‌ నారాయణ్‌ ఆధునిక భావాలున్న వ్యక్తి. 2008 నుంచి మల్లేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి పార్టీ.. ఒక్కలిగ వర్గానికి చెందిన ఈయనను డిప్యూటీ సీఎంను చేసింది.

ప్రహ్లాద్‌ జోషి(58)
కేంద్ర బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన ప్రహ్లాద్‌ జోషి బ్రాహ్మణ వర్గానికి చెందిన సీనియర్‌ నేత. ధర్వాడ్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రధాని మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరుంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈయనకు కేబినెట్‌ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు చక్కబెడతారని ఈయనకు పేరుంది.

విశ్వేశ్వర హెగ్డే కగెరి(60)
ప్రస్తుతం సిర్సి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వేశ్వర హెగ్డే కగెరి ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఏబీవీపీ విద్యార్థి నేతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top