అభ్యర్థుల ప్రచార పాట్లు! | west bengal mla candidates starts new stunts | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రచార పాట్లు!

Mar 23 2026 12:36 AM | Updated on Mar 23 2026 5:44 AM

west bengal mla candidates starts new stunts

బెంగాల్‌ ఎన్నికల్లో చిత్రాలు  

ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్‌లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకు­ని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్‌ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.

చపాతీలు చేస్తూ... 
అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్‌ లేక కట్టెల పొయ్యి­తో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయ­త్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్‌లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళ­ను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశా­ను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్‌ సిలిండ­ర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇ­బ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.

కళ్లకు గంతలు కట్టుకుని..  

రాష్ట్రంలోని బీర్భూమ్‌ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్‌ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నరేష్‌ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్‌’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు.  అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్‌ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనూప్‌ కుమార్‌ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్‌పూర్‌లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

సీపీఎం అభ్యర్థి పూజలు 
పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్‌ దాస్‌గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్‌ తళా ఘాట్‌ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్‌గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్‌ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్‌ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్‌పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్‌ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్‌గ్రామ్‌ అటవీ ప్రాంతంలోని  పటాశిముల్‌లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్‌ చల్లుతూ ఆడుకున్నారు.

‘మత్స్య’ రాజకీయాలు 
బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ శరద్వాత్‌ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్‌ లేక్‌లోని ఐఏ మార్కెట్‌లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు  రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement