Chapaties
-
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్‌లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్‌పూర్‌లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్‌గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్‌గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్‌లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్లో నరకం చూశాం
- చెడిపోయిన చపాతీలే ఆహారం - నిఠారుగా నిలువలేని సెల్లో దుర్భరం - నాగర్‌కోవిల్ జాలర్ల పరిస్థితి దయనీయం చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘చెడిపోయిన చపాతీ, చంటిపిల్లల్లా ఒక ముద్ద అన్నం. నిఠారుగా నిల్చుకునేందుకు కూడా వీలులేని సెల్లో నరకం అనుభవించాం... బద్దశత్రువుకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు’ అని తమిళనాడు జాలర్లు తల్లడిల్లిపోయారు. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపం కడియప్పట్టికి చెందిన అంతోనీరాజ్ (38), డేవిడ్(42), హిలారిడన్(51), ప్రభు(33) అనే నలుగురు మత్స్యకారులు చేపలుపట్టే వృత్తిపై 2015 జులైలో దుబాయ్‌కి వెళ్లారు. తమ దేశ సముద్రపు సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తున్నారనే ఆరోపణలతో ఫిబ్రవరి 6 వ తేదీన ఇరాన్ ఈ నలుగురిని అరెస్ట్ చేసింది. నలుగురు జైలుపాలు కావడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. బాధిత కుటుంబాల వారు కన్యాకుమారి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. నేషనల్ డొమెస్టిక్ వర్క్స్ మూమెంట్ అనే సంస్థకు సమాచారం చేరవేశారు. వారి ద్వారా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి నలుగురిని విడుదల చేయించింది. ఈ నలుగురు జాలర్లు ఆదివారం దుబాయ్ నుంచి విమానం ద్వారా చెన్నైకి సురక్షితంగా చేరారు. వీరందరినీ తమిళనాడు పునరావాసశాఖ సహాయ కమిషనర్ రమేష్ పరామర్శించి వాం గ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి నాగర్‌కోవిల్‌కు పంపారు. పునరావాస కమిషనర్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో దయనీయమైన పరిస్థితులను వారు వివరించారు. నరకం చూపిన ఇరాన్ విదేశాలకు వెళ్తే అధికంగా సంపాదించవచ్చన్న ఆశతో తాము చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకి తెచ్చిందని బాధితులు నలుగురు బావురుమన్నారు. బతికి ఉండగానే ఇరాన్ అధికారులు తమకు నరకం చూపారని వాపోయారు. దుబాయ్ సముద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన తాము చేపలవేట సాగిస్తుండగా తమ హద్దుల్లోకి వచ్చారని ఆరోపిస్తూ ఇరాన్ సముద్ర తీర గస్తీదళాలు తమపై కాల్పులు జరిపాయని తెలిపారు. ఒక బుల్లెట్ తన వీపుపై గాయం చేయగా మరో బుల్లెట్ తనను రాచుకుంటూ వెళ్లిందని అంతోనీరాజ్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన తనను ఆసుపత్రిలో చేర్చకుండా నేరుగా అక్కడి జైల్లో పెట్టేశారని చెప్పాడు. తమ నలుగురిని ఒక గుహ వంటి సెల్లో పెట్టారని, ఆ సెల్లో నిఠారుగా నిల్చుకునేందుకు వీలుండే ఎత్తు ఉండదని తెలిపారు. నిరంతరం ఒంగోనే ఉండాలని వాపోయారు. సరైన ఆహారం కూడా పెట్టేవారు కాదన్నారు. ఉదయం పూట చిన్న పిల్లలకు పెట్టినట్లు ఒక ముద్ద అన్నం, రాత్రివేళల్లో చెడిపోయిన చపాతీ ఇచ్చేవారని తెలిపారు. పారవేయాల్సిన ఆహారం తింటూ ఇరాన్ రాక్షసుల నుంచి ప్రాణాలను కాపాడుకున్నామని తమిళనాడు జాలర్లు వాపోయారు. ఒక సెల్ నుంచి మరో సెల్‌కు తమను మార్చేపుడు కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టివేసి తీసుకెళ్లేవారని అన్నారు. గుడ్డలు మార్చుకునేందుకు కూడా వీలులేక మాసిన గుడ్డలతోనే చెరలో మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలు నుంచి విడుదలవుతున్న ఇతర ఖైదీలు దయతో ఇచ్చిన గుడ్డలు ధరించి కాలం వెళ్లదీశామని అన్నారు. ఇరాన్ జైలు నుంచి ఇక ఇళ్లకు వెళ్లే అవకాశం లేదని జీవితంపై ఆశలు వదులుకున్నామని, జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీశామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు, అధికారులు తీసుకున్న చర్యల వల్ల బతికి బైటపడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ప్రాణాలతో బైటపడటమే గొప్ప అదృష్టమని, ఇది తమకు పునర్జన్మని వారు పేర్కొన్నారు.


