ఇరాన్‌లో నరకం చూశాం | Taminadu fishermen talk about iran prison | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో నరకం చూశాం

May 3 2016 9:54 PM | Updated on Sep 3 2017 11:20 PM

‘చెడిపోయిన చపాతీ, చంటిపిల్లల్లా ఒక ముద్ద అన్నం. నిఠారుగా నిల్చుకునేందుకు కూడా వీలులేని సెల్‌లో నరకం అనుభవించాం... బద్దశత్రువుకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు’ అని తమిళనాడు జాలర్లు తల్లడిల్లిపోయారు.

- చెడిపోయిన చపాతీలే ఆహారం
- నిఠారుగా నిలువలేని సెల్‌లో దుర్భరం
- నాగర్‌కోవిల్ జాలర్ల పరిస్థితి దయనీయం

 
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘చెడిపోయిన చపాతీ, చంటిపిల్లల్లా ఒక ముద్ద అన్నం. నిఠారుగా నిల్చుకునేందుకు కూడా వీలులేని సెల్‌లో నరకం అనుభవించాం... బద్దశత్రువుకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు’ అని తమిళనాడు జాలర్లు తల్లడిల్లిపోయారు.  కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపం కడియప్పట్టికి చెందిన అంతోనీరాజ్ (38), డేవిడ్(42), హిలారిడన్(51), ప్రభు(33) అనే నలుగురు మత్స్యకారులు చేపలుపట్టే వృత్తిపై 2015 జులైలో దుబాయ్‌కి వెళ్లారు. తమ దేశ సముద్రపు సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తున్నారనే ఆరోపణలతో ఫిబ్రవరి 6 వ తేదీన ఇరాన్ ఈ నలుగురిని అరెస్ట్ చేసింది. నలుగురు జైలుపాలు కావడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. బాధిత కుటుంబాల వారు కన్యాకుమారి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు.
 
  నేషనల్ డొమెస్టిక్ వర్క్స్ మూమెంట్ అనే సంస్థకు సమాచారం చేరవేశారు. వారి ద్వారా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి నలుగురిని విడుదల చేయించింది. ఈ నలుగురు జాలర్లు ఆదివారం దుబాయ్ నుంచి విమానం ద్వారా చెన్నైకి సురక్షితంగా చేరారు. వీరందరినీ తమిళనాడు పునరావాసశాఖ సహాయ కమిషనర్ రమేష్ పరామర్శించి వాం గ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి నాగర్‌కోవిల్‌కు పంపారు. పునరావాస కమిషనర్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో దయనీయమైన పరిస్థితులను వారు వివరించారు.
 
 నరకం చూపిన ఇరాన్ విదేశాలకు వెళ్తే అధికంగా సంపాదించవచ్చన్న ఆశతో తాము చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకి తెచ్చిందని బాధితులు నలుగురు బావురుమన్నారు. బతికి ఉండగానే ఇరాన్ అధికారులు తమకు నరకం చూపారని వాపోయారు. దుబాయ్ సముద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన తాము చేపలవేట సాగిస్తుండగా తమ హద్దుల్లోకి వచ్చారని ఆరోపిస్తూ ఇరాన్ సముద్ర తీర గస్తీదళాలు తమపై కాల్పులు జరిపాయని తెలిపారు. ఒక బుల్లెట్ తన వీపుపై గాయం చేయగా మరో బుల్లెట్ తనను రాచుకుంటూ వెళ్లిందని అంతోనీరాజ్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన తనను ఆసుపత్రిలో చేర్చకుండా నేరుగా అక్కడి జైల్లో పెట్టేశారని చెప్పాడు. తమ నలుగురిని ఒక గుహ వంటి సెల్‌లో పెట్టారని, ఆ సెల్‌లో నిఠారుగా నిల్చుకునేందుకు వీలుండే ఎత్తు ఉండదని తెలిపారు. నిరంతరం ఒంగోనే ఉండాలని వాపోయారు. సరైన ఆహారం కూడా పెట్టేవారు కాదన్నారు. ఉదయం పూట చిన్న పిల్లలకు పెట్టినట్లు ఒక ముద్ద అన్నం, రాత్రివేళల్లో చెడిపోయిన చపాతీ ఇచ్చేవారని తెలిపారు. పారవేయాల్సిన ఆహారం తింటూ ఇరాన్ రాక్షసుల నుంచి ప్రాణాలను కాపాడుకున్నామని తమిళనాడు జాలర్లు వాపోయారు. ఒక సెల్ నుంచి మరో సెల్‌కు తమను మార్చేపుడు కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టివేసి తీసుకెళ్లేవారని అన్నారు.
 
 గుడ్డలు మార్చుకునేందుకు కూడా వీలులేక  మాసిన గుడ్డలతోనే చెరలో మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలు నుంచి విడుదలవుతున్న ఇతర ఖైదీలు దయతో ఇచ్చిన గుడ్డలు ధరించి కాలం వెళ్లదీశామని అన్నారు. ఇరాన్ జైలు నుంచి ఇక ఇళ్లకు వెళ్లే అవకాశం లేదని జీవితంపై ఆశలు వదులుకున్నామని, జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీశామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు, అధికారులు తీసుకున్న చర్యల వల్ల బతికి బైటపడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ప్రాణాలతో బైటపడటమే గొప్ప అదృష్టమని, ఇది తమకు పునర్జన్మని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement