వయోలిన్‌ విద్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ కన్నుమూత | Violin Maestro TN Krishnan Passed Away: Pm Mourned To Him | Sakshi
Sakshi News home page

ఆ స్వర విన్యాసం వాయు‘లీనం’

Nov 4 2020 8:43 AM | Updated on Nov 4 2020 9:09 AM

Violin Maestro TN Krishnan Passed Away: Pm Mourned To Him - Sakshi

చెన్నై : కర్ణాటక సంగీత ప్రపంచంలో వయోలిన్‌ త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు టీఎన్ కృష్ణన్‌. వయోలిన్‌ త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ లాల్‌గుడి జీ జయరామన్, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌. వారిద్దరూ ఏడేళ్ల కిందటే కొద్ది నెలల వ్యవధిలో గతించారు. వారిలో ఒకరైన టీఎన్ కృష్ణన్‌ సోమవారం రాత్రి చెన్నైలో కన్ను మూశారు. కేరళలోని తిరుపణిత్తూర్‌లో నారాయణ అయ్యర్, అమ్మణి అమ్మాళ్‌ దంపతులకు 1928 అక్టోబర్‌ 6న జన్మించిన తిరుపణిత్తూర్‌ నారాయణ అయ్యర్‌ కృష్ణన్‌ బాల విద్వాంసుడిగా పదకొండేళ్ల పసితనం నుంచే కచేరీలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి వద్ద సరిగమలు నేర్చుకుని, సాధన ప్రారంభించారు. తండ్రి నారాయణన్‌ అయ్యర్‌ కొచ్చిన్‌ సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. ఆయన గాత్ర విద్వాంసుడే కాకుండా, బహువాద్య నిపుణుడు. తన తండ్రి తొంభై తొమ్మిదో ఏట కన్నుమూసేంత వరకు తనకు సంగీత పాఠాలు చెబుతూనే వచ్చారని కృష్ణన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. చదవండి: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్

బాల్యంలోనే ఆయన ఆనాటి సంగీత దిగ్గజాలు అరైకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ఎం.డి.రామనాథన్, అళత్తూర్‌ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి పక్కన వయొలిన్‌ వాయించేవారు. సంగీతంలో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో 1942లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత విద్వాంసుడు శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ను కలుసుకుంటే, ఆయన కృష్ణన్‌ బాధ్యతను పారిశ్రామికవేత్త అయ్యదురైకి అప్పగించారు. అయ్యదురై దంపతులు కృష్ణన్‌ను తమ ఇంట్లోనే ఉంచుకుని, సొంత బిడ్డలా చూసుకున్నారు. అరైకుడి రామానుజ అయ్యంగార్, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ల శిక్షణలో టి.ఎన్‌.కృష్ణన్‌ తన సంగీత ప్రజ్ఞకు మరింతగా మెరుగులు దిద్దుకున్నారు. చదవండి: కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత

సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండానే, ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్న టి.ఎన్‌.కృష్ణన్‌ సంగీత ఆచార్యుడిగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. మద్రాసు సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా, తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ డీన్‌గా సేవలందించారు. కేవలం లిపిబద్ధంగా మాత్రమే అందుబాటులో ఉన్న పూర్వ విద్వాంసుల స్వరకల్పనలను యథాతథంగా శ్రోతలకు వినిపించే అరుదైన విద్వాంసుల్లో ఒకరిగా టి.ఎన్‌.కృష్ణన్‌ తన సమకాలికుల మన్ననలు చూరగొన్నారు. జాంగ్రీ, బాదం హల్వాలను అమితంగా ఇష్టపడే కృష్ణన్, తన స్వరాలకు బహుశ వాటి మాధుర్యాన్ని అద్దారేమోననిపిస్తుంది ఆయన కచేరీలు వినేవాళ్లకు.

దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన కచేరీలు చేశారు. ఉస్తాద్‌ అమ్జద్‌ అలీ ఖాన్, జాకిర్‌ హుస్సేన్‌ వంటి హిందుస్తానీ విద్వాంసులతో కలసి చేసిన జుగల్‌బందీ కచేరీలు ఆయనను ఉత్తరాది శ్రోతలకూ దగ్గర చేశాయి. టి.ఎన్‌.కృష్ణన్‌ సోదరి ఎన్‌.రాజం కూడా వయోలిన్‌ విద్వాంసురాలే. అయితే, ఆమె హిందుస్తానీ విద్వాంసురాలు. ఆమెతో కలసి కూడా జుగల్‌బందీలు చేశారు. ఆయన కుమార్తె విజి కృష్ణన్‌ నటరాజన్, కుమారుడు శ్రీరామ్‌ కృష్ణన్‌ సహా ఎందరో శిష్యులు కర్ణాటక సంగీత విద్వాంసులుగా రాణిస్తున్నారు. 

టి.ఎన్‌.కృష్ణన్‌ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో ఆయనను ‘పద్మశ్రీ’తో, 1992లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు (1974), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ (2006) పొందారు. చెన్నైలోని ది ఇండియన్‌ ఫైనార్ట్స్‌ సొసైటీ 1999లో ఆయనను ‘సంగీత కళాశిఖామణి’ బిరుదుతో సత్కరించింది. ఇవే కాకుండా, తన ఎనభయ్యేళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆయన ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు టి.ఎన్‌.కృష్ణన్‌ సంగీత రంగానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement