Varanasi Gyanvapi Mosque ASI Survey SC Petition Updates, Details Inside - Sakshi
Sakshi News home page

Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్‌.. సుప్రీం కీలక ఆదేశాలు

Published Mon, Jul 24 2023 7:50 AM

Varanasi Gyanvapi Mosque ASI Survey SC Petition Updates - Sakshi

ఢిల్లీ/లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీద్‌లో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(భారత పురాతత్వ సర్వేక్షణ) సర్వేపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులపాటు (బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా) సర్వేను నిలిపివేయాలని ఏఎస్‌ఐను ఆదేశించింది. 

సోమవారం ఉదయం ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌(కలెక్టర్‌) ఇంతకు ముందే స్పష్టం చేశారు. దీంతో పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించగా.. 40 మంది ఏఎస్‌ఐ అధికారులు వాళ్లను అనుసరిస్తూ లోనికి వెళ్లారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. సీల్‌ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. ఒకవైపు సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్‌ఐను ఆపేయాలని ఆదేశించింది.  

వాజుఖానాలో ఆకారం బయటపడడం.. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖను శుక్రవారం ఆదేశించింది. దీంతో.. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్‌ఐ తన నివేదికను అందించాల్సి ఉంది. 


► మే 16, 2022న జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లోని వాజుఖానాలో ఆ ఆకారం బయటపడింది.

► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. 

► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా..  ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. 

► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్‌ సర్వే నిర్వహించారు.

► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది.

► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ,  అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. 

► అయితే ఈ ఏడాది మే 19వ తేదీన.. జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కార్బన్‌ డేటింగ్‌ పద్దతి సహా సైంటిఫిక్‌ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.  తొందరపాటు వద్దని, సైంటిఫిక్‌ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది.

►  మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు.  హిందూ మహిళల పిటిషన్‌ ఆధారంగా.. జులై 21వ తేదీన జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్‌ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది.

► తాజాగా.. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. దీంతో ఇవాళ్టి సుప్రీం విచారణపైనా ఉత్కంఠ నెలకొంది.

► సుప్రీంకోర్టులో ముస్లిం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముస్లింల పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.

► సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. 1500వ సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉంది. ఈ విషయంలో అంత తొందర ఎందుకు?. దీనిపై స్టేటస్‌ కో ఆర్ఢర్‌ ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. దీనికి జూలై 26న విచారణ జరుగునున్నట్టు కోర్టుకు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. 

► ఈ సందర్భంగా ధర్మాసనం.. జూలై 28వ తేదీ శుక్రవారం వరకు యథాతథ స్థితి ఉంటుందని స్టేట్‌కో ఇవ్వగలరా అని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. ఇక, యూపీ ప్రభుత్వం హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేదా ఆక్రమణ జరగడం లేదన్నారు. ఈ క్రమంలో జూలై 26 వరకు అక్కడ ఎలాంటి సర్వేలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5గంటల వరకు సర్వే ఆపాలని ఆదేశించింది. 

Advertisement
Advertisement