యూఎస్ విజిటర్ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్, ఇక నుంచి..

సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్. తొలిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఊరట ఇచ్చింది అగ్రరాజ్యం. వీసా కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు అదనపు చర్యలు చేపట్టింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత మూడేళ్ల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ సమస్యను పరిష్కరించడానికి.. శనివారాల్లో ప్రత్యేక వీసా ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది.
తద్వారా అదనపు స్లాట్లతో భారీగా అప్పాయింట్‌మెంట్‌లు అందుబాటులోకి రాన్నాయి. వీసా దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే ఈ భారీ ప్రయత్నంలో భాగంగా.. జనవరి 21వ తేదీన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లు విజిటర వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇందుకోసం డజన్ల కొద్దీ తాత్కాలిక సిబ్బందిని నియమించారు కూడా.
ఇక ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి జనవరి మరియు మార్చి 2023 మధ్య వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి రానున్నారు. మరోవైపు ఎంబసీ, కాన్సులేట్‌లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను కూడా పెంచుతోంది.
"రాబోయే రోజుల్లో.. ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్‌మెంట్‌ల కోసం అదనపు స్లాట్‌లను తెరుస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇదివరకే మునుపటి అమెరికా వీసాలతో ఉన్న దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూలను మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. అటువంటి దరఖాస్తుదారులు ఇకపై వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరుకావలసిన అవసరం లేదు.
మరిన్ని వార్తలు :