Singareni Privatization: ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..

Union Minister Prahlad Joshi Statement On Singareni Privatization - Sakshi

సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్‌లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్‌లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి  ప్రకటన జారీ చేశారు.

సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు.
చదవండి: గుజరాత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారు

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top