
లక్నో: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను తిరిగి దక్కించుకునేందుకు అతని కుమారుడు ఉమర్ అన్సారీ చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఆధారాలుగా చూపిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఉదంతంపై ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో.. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని బండాలో గల ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ కన్నుమూశాడు. తాజాగా తన తండ్రి ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ అతని కుమారుడు ఉమర్ అన్సారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకోసం అతను తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలు కలిగిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించాడని సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా పరారీలో ఉన్న ఉమర్ అన్సారీపై రూ.50 వేల రివార్డు ఉంది. ఉమర్ అన్సారీ మోసపూరిత చర్యలు బయటపడిన దరిమిలా అతనిపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా ఘాజీపూర్ పోలీసుల బృందం లక్నో నుండి ఉమర్ అన్సారీని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.