ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు.
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.
వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.


