మహా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. అంబేద్కర్‌ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ కలిసొచ్చేనా?

Uddhav Thackeray announced alliance with Prakash Ambedkar VBA - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ(సోమవారం) కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఊహించని పొత్తుతో సంచలనానికి తెర తీసింది ఉద్దవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన. అంబేద్కర్‌ మనవడి పార్టీతో పొత్తు ద్వారా ముంబై స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. 

అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ యశ్వంత్‌ అంబేద్కర్‌ నేతృత్వంలోని ‘వంచిత్‌ బహుజన్‌ అగాధి’(VBA)తో పొత్తుకు థాక్రే రెడీ అయ్యారు. 2018లో ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, వీబీఐతో ముంబై మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొత్తు కోసం రెండు నెలలుగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేకాదు నవంబర్‌లో బాల్‌ థాక్రే తండ్రి ప్రబోధంకర్‌ థాక్రే పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా.. ఆ కార్యక్రమంలో థాక్రే-అంబేద్కర్‌లు ఒకే వేదికను పంచుకున్నారు.  

‘‘ఇవాళ జనవరి 23. బాలాసాహెచ్‌ థాక్రే(బాల్‌ థాక్రే) జయంతి కూడా. రాష్ట్రంలో చాలామంది ఇదే కోరుకుంటున్నారు(పొత్తును ఉద్దేశించి..). ప్రకాశ్‌ అంబేద్కర్‌, నేను ఇవాళ జట్టుగా ముందుకు వెళ్లేందుకు కలిశాం అని ఉద్దవ్‌ థాక్రే ప్రకటించారు. మా తాత, ప్రకాశ్‌ అంబేద్కర్‌  తాత ఇద్దరూ సహచరులు. సామాజిక అంశాలపై కలిసి పోరాడారు. ఇప్పుడు వాళ్ల వారసులమైన మేం సమకాలీన అంశాలపై పోరాడేందుకు ఇక్కడ ఒక్కటయ్యాం అని థాక్రే పేర్కొన్నారు. 

ఇక ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కొత్తదనం మొదలైందని పేర్కొన్నారు. గెలుస్తామో లేదో అనేది ఓటర్ల చేతిలో ఉంది. కానీ, సామాజికాంశాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లకు సీట్లు ఇవ్వడం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మేం ఇద్దరమే. కాంగ్రెస్‌ ఇంకా పొత్తుపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఎన్సీపీ శరద్‌ పవార్‌ పొత్తుపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం అని అంబేద్కర్‌ తెలిపారు. 

మహారాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం చెదిరిపోయి.. శివసేనలోని ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబాటు, ఆపై బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న ప్రధాన ఎన్నిక బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top