సాక్షి, చెన్నై: తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 27న 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ను ఇరికించే కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని వెంటనే ముగించి జనాన్ని పంపేయకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేశారని, అందుకే జనం అక్కడే ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్న కోణంలో నేరాభియోగాలు మోపాలని, ఆ చార్జ్‌షీట్‌లో విజయ్ పేరును చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి.
విజయ్‌తోపాటు అదనపు డీజీపీ, మరో తమిళనాడు సీనియర్ పోలీస్ అధికారి పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకధాటిగా ఆరు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు విజయ్ ఢిల్లీ లోథీ రోడ్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం 10.20 గంటలకువచ్చారు.
ర్యాలీని ఏ తరహాలో చేయాలని ప్రణాళిక వేశారు?. షెడ్యూల్ సమయం కంటే చాలా ఆలస్యంగా ఎందుకు ర్యాలీకి రావాల్సి వచ్చింది? జనం విపరీతంగా వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు?. జనం అదుపుతప్పుకున్నారని అర్థమయ్యాక కూడా జనాన్ని కట్టడిచేసే చర్యలను మీ పార్టీ శ్రేణులు ఎందుకు తీసుకోలేదు? వంటి పలు రకాల ప్రశ్నలకు విజయ్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి సమాధానం చెప్పిన విజయ్ మరికొన్నింటికి వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విచారణ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్‌ను నుంచి బయటకు వచ్చి తాను బసచేస్తున్న హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ కేసులో ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ తన తొలి నేరాభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించనుంది.


